ఆర్అండ్బీ చీఫ్ ఇంజనీర్ నవీన్‌తో సబ్కా కాంట్రాక్టర్ల భేటీ
విజయవాడ, ఆంధ్రప్రభ : రోడ్లు, భవనాల శాఖ భవన నిర్మాణ విభాగం చీఫ్ ఇంజనీర్, స్టేట్ ఆర్కిటెక్ట్ కె. నవీన్‌ను సబ్కా కాంట్రాక్టర్ల ప్రతినిధి బృందం బందరు రోడ్డులోని ఆర్అండ్బీ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసింది. ఇటీవల సీఈ గా బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా ఆయనకు శాలువాతో ఘనంగా సన్మానం చేసి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా ఆర్అండ్బీ శాఖ పరిధిలో జరుగుతున్న భవన నిర్మాణ పనుల్లో ఎదురవుతున్న సమస్యలను ప్రతినిధులు సీఈ దృష్టికి తీసుకెళ్లారు.
కాంట్రాక్టర్ల వినతులపై సానుకూలంగా స్పందించిన కె. నవీన్, నిధుల విడుదల, సాంకేతిక అనుమతులు, పనుల పురోగతికి సంబంధించిన అంశాలపై సమీక్షించి, సంబంధిత ఎస్ఈలు, ఈఈలకు ఫోన్ ద్వారా తక్షణ ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రంలోని పలువురు కాంట్రాక్టర్లు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశంలో పాల్గొని తమ సమస్యలను వివరించారు. కార్యక్రమంలో సబ్కా గుంటూరు–ప్రకాశం కమిటీ కార్యదర్శి భూపేంద్ర సిన్హా, ఉపాధ్యక్షుడు నాగభూషణం, కోశాధికారి గంగయ్య, సలహాదారు శివకుమార్, కృష్ణా జిల్లా కోశాధికారి వెంకటేశ్వర రాజు, కమిటీ సభ్యుడు వంశీకృష్ణ, సీనియర్ కాంట్రాక్టర్ జనార్ధనరావుతో పాటు పలువురు సభ్యులు పాల్గొన్నారు.
