ఎమ్మెల్యేపై అనుచిత వ్యాఖ్యలపై మండిపడ్డ తెలుగు తమ్ముళ్ళు…

ఎమ్మెల్యేపై అనుచిత వ్యాఖ్యలపై మండిపడ్డ తెలుగు తమ్ముళ్ళు…

చిరువ్యాపారుల పొట్ట కొడుతున్న మహిళపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌…

ఏలూరు బ్యూరో. ఆంధ్రప్రభ : ఒకపక్క అనునిత్యం పేద ప్రజలకు మేలు చేకూర్చడమే ధ్యేయంగా పరితపిస్తూ, మరోపక్క ముఖ్యమంత్రి చంద్రబాబు మన్ననలు పొందుతూ తనదైన శైలిలో ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గాన్ని అభివృద్ధిపథంలో ముందుకు నడిపించేందుకు అహర్నిశలు శ్రమిస్తోన్న ఎమ్మెల్యే బడేటి చంటిపై నగరానికి చెందిన ఒక మహిళ అనుచిత వ్యాఖ్యలు చేయడంపై తెలుగు తమ్ముళ్ళు అగ్గిమీద గుగ్గిలమయ్యారు. ఆ మహిళ తీరుపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఇదేమాదిరిగా ఊరుకుంటూ పోతే పరిస్థితి మరింత శృతిమించి పోతోందని ఆగ్రహం వ్యక్తం చేసిన టిడిపి శ్రేణులు, ఆ మహిళలపై చర్యలు తీసుకోవాలని ముక్తకంఠంతో పోలీసులను డిమాండ్‌ చేశారు.

అంతేకాకుండా ఆ మహిళ వెనుక ఉండి గత 5నెలల నుండి వివిధ రూపాల్లో డ్రామాలాడిస్తున్న వ్యక్తులెవరో నిగ్గుతేల్చాలని, లేనిపక్షంలో తాము భవిష్యత్ కార్యాచరణ చేపట్టాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఏలూరులో మంగళవారం కొన్ని గంటల పాటూ కొనసాగిన ఈ వ్యవహారం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. గత కొద్ది నెలల నుండి స్వర్ణలత అనే మహిళ ప్రజా సమస్యల పేరిట ఆందోళనలు నిర్వహించడం, ఆ తర్వాత వాటిని సోషల్‌ మీడియాలో పెట్టి అటు అధికారులపై, ఇటు ప్రజా ప్రతినిధులపై అభ్యంతర కర వ్యాఖ్యలు చేయడం పరిపాటిగా మారింది.

కొద్దిరోజుల కిందట ఏలూరు నగరంలోని ఫుట్‌పాత్‌లను చిరువ్యాపారులు ఆక్రమించుకోవడం వలన ప్రజలు ఇబ్బందులు పడుతున్నారంటూ కలెక్టరేట్‌లో జరిగే మీకోసం కార్యక్రమంలో ఫ్లకార్డులు పట్టుకుని ఆందోళన చేసింది. దీనిపై జిల్లా ఉన్నతాధికారులు తీవ్రస్థాయిలో మండిపడ్డారు కూడా, ఇదేకాకుండా అర్థరాత్రి పూట నగరంలో ద్విచక్ర వాహనంపై సంచరిస్తూ తెరిచివున్న దుకాణాలను వీడియో తీసి సోషల్‌ మీడియా ద్వారా ఏదో జరిగిపోతోందన్న భ్రమ కల్పించేలా ప్రచారం చేసుకుంటూ వస్తోంది. ఈ నేపథ్యంలో నగరంలోని ఫుట్‌పాత్‌లపై ఉన్న ఆక్రమణలు తొలగించాలంటూ సోమవారం ఉదయం కలెక్టరేట్‌ వద్ద నిరసన దీక్ష చేపట్టింది. మరోవైపు ఈమె ఇచ్చిన ఫిర్యాదులపై అధికారులు చర్యలు తీసుకునేందుకు ఉపక్రమించడంతో చిరువ్యాపారులు తమ భృతికి ఇబ్బంది కలుగుతుందన్న భయంతో ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటిని ఆశ్రయించి తాము నిబంధనల మేరకే వ్యాపారాలు చేసుకుంటూ కుటుంబాలను పోషించుకుంటున్నామని, తమకు అన్యాయం చేయవద్దంటూ మొరపెట్టుకున్నారు.

తాను పేదలకు మేలు చేయాలన్న లక్ష్యంతోనే పనిచేస్తున్నానని, వారిపై కక్ష్య సాధింపు చర్యలను తానుకూడా ఉపేక్షించనని, అయితే కొంతమంది కావాలని చిరువ్యాపారాలను అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నారని చెప్పారు. దీంతో తన పబ్బం కోసం తమ పొట్టకొట్టే ప్రయత్నం చేస్తున్న స్వర్ణలత ఆందోళన చేస్తున్న కలెక్టరేట్‌ వద్దకు చిరువ్యాపారాలు చేసుకునే మహిళలు చేరుకుని ఆందోళనకు దిగారు. తన స్వార్థం కోసం చిరువ్యాపారాలు చేసుకుంటూ కుటుంబాలను పోషించుకుంటున్న తమను రోడ్డుపాలు చేయవద్దని ఆమెనుద్దేశించి వ్యాఖ్యానించారు. ఈ సమయంలో స్వర్ణలత, చిరువ్యాపారాలు చేసుకునే మహిళల మధ్య కొంత వాగ్వివాదం చోటుచేసుకుంది. పోలీసులు జోక్యం చేసుకుని ఎటువంటి సంఘటనలు చోటుచేసుకోకుండా నివారించారు.

ఈ సందర్భంగానే స్వర్ణలత మాట్లాడుతూ ప్రజాభిమాన నేతగా పేరొందిన ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి, ఆయన కుటుంబ సభ్యుల్ని ఉద్దేశించి కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేశారు. అనంతరం పోలీసులు స్వర్ణలతను అక్కడ నుండి ఏలూరు 1టౌన్‌ పోలీసు స్టేషన్‌కు తరలించేందుకు ఏర్పాట్లు చేశారు. అప్పటికే ఆమె చేసిన అనుచిత వ్యాఖ్యలు సోషల్‌ మీడియా ద్వారా చూసిన టిడిపి జిల్లా మీడియా కో-ఆర్డినేటర్‌ చల్లా వెంకటసత్యవరప్రసాదరావు, టిడిపి నగర అధ్యక్ష, కార్యదర్శులు చోడే వెంకటరత్నం, రెడ్డి నాగరాజు, మరికొంతమంది టిడిపి నాయకులు జెడ్పి వద్దకు చేరుకుని స్టేషన్‌కు తరలిస్తున్న స్వర్ణలతను అడ్డుకోవడానికి ప్రయత్నించారు.

అయితే పోలీసులు ఆమెను ఆటోలో స్టేషన్‌కు తరలించారు. అక్కడ నుండి స్టేషన్‌కు చేరుకున్న టిడిపి నాయకులు తమ అభిమాన నేత, ఎమ్మెల్యే బడేటి చంటిపై ఆమె చేసిన వ్యాఖ్యల పట్ల తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ ఆమెపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ఈ సందర్భంగానే ఆమె అనుచిత వ్యాఖ్యలు చేసిన సమయంలో అక్కడే ఉన్న పోలీసు అధికారులు మౌనం వహించడం పట్ల కూడా వారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక ప్రజాప్రతినిధిని ఈ విధంగా అసభ్యపదజాలంతో దూషించడం సమంజసమా అంటూ వారు పోలీసులను నిలదీశారు.

తమ అభిమాన నేతపై అనుచిత వ్యాఖ్యలు చేసిన స్వర్ణలతపై సుమోటోగా కేసు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. అంతేకాకుండా ఆమె వెనుక ఉండి డ్రామాలు ఆడిస్తున్న వారి నిగ్గుకూడా తేల్చాలని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా మీడియా కో-ఆర్డినేటర్‌ చల్లా వెంకట సత్యవరప్రసాదరావు మీడియాతో మాట్లాడుతూ గత 5నెలల నుండి స్వర్ణలత ఆందోళన కార్యక్రమాలు నిర్వహించుకుంటున్నా తాము జోక్యం చేసుకోలేదని, అయితే ఎటువంటి సంబంధం లేకుండా ప్రజాభిమానం కలిగివున్న ఏలూరు ఎమ్మెల్యేపై అనుచిత వ్యాఖ్యలు చేయడంతో తమ మనసులు ఆందోళన చెంది నేరుగా రంగంలోకి దిగాల్సి వచ్చిందన్నారు.

ఏలూరులోని జ్యూట్‌మిల్లు మూతపడడంతో దాదాపు 7వేల మంది రోడ్డున పడ్డారని ఇటువంటి పరిస్థితుల్లో చాలా మంది చిన్నచిన్న వ్యాపారాలు చేసుకుని తమ కుటుంబాలను పోషించుకుంటున్నారని అటువంటి వారికి ఎమ్మెల్యే బడేటి చంటి అండగా నిలిచారని చెప్పారు. అయితే వారిని కూడా ఇబ్బందుల పాలుజేస్తూ స్వర్ణలత అనే మహిళ నిరాధారమైన ఫిర్యాదులను అధికారులకు అందజేస్తూ వారి వ్యాపారాలను అడ్డుకునేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపించారు.

అదీకాకుండా ఈ రోజు ఏలూరు ఎమ్మెల్యేపై ఉద్దేశ్యపూర్వకంగా ఆమె చేసిన అనుచిత వ్యాఖ్యలు ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గ ప్రజలను తీవ్రంగా బాధించాయని, ఆమె ఎందుకు అలా మాట్లాడిందో చెప్పాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. పోలీసులు ఆమెపై కేసు నమోదు చేసి తదుపరి చర్యలు తీసుకోవాలని , లేనిపక్షంలో టిడిపి తరపున ఆందోళన కార్యక్రమాలకు శ్రీకారం చుడతామని హెచ్చరించారు. టిడిపి నగర అధ్యక్షులు చోడే వెంకటరత్నం మాట్లాడుతూ ప్రజలకు మేలు చేయాలన్న తలంపుతో ఆందోళనలు చేస్తున్న స్వర్ణలత ఎవరిని మెప్పించడానికి ప్రజానేత, ఎమ్మెల్యే బడేటి చంటిపై అనుచిత వ్యాఖ్యలు చేసిందో చెప్పాలని డిమాండ్‌ చేశారు.

Leave a Reply