రోడ్డు ప్రమాదంలో సాఫ్ట్‌వేర్ దంపతుల మృతి
రోడ్డు ప్రమాదంలో సాఫ్ట్‌వేర్ దంపతుల మృతి
రెండు కుటుంబాల్లో విషాదం
ఆదోని, ఆంధ్రప్రభ : సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలు చేస్తూ సొంతిల్లు కట్టుకుని ఆనందంగా జీవిస్తున్న యువ దంపతులను రోడ్డు ప్రమాదం బలిగొంది. కర్ణాటక సరిహద్దు సమీపంలో జరిగిన ఈ ప్రమాదం రెండు కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. పట్టణంలోని తిరుమలనగర్ కాలనీకి చెందిన కార్పొరేషన్ బ్యాంకు రిటైర్డ్ ఉద్యోగి అమరేష్, సుమతి దంపతుల ఒక్కగానొక్క కుమారుడు అనురాగ్ (31) బెంగళూరులో సాఫ్ట్‌వేర్ ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. బళ్లారికి చెందిన ఐశ్వర్య కూడా సాఫ్ట్‌వేర్ ఉద్యోగిగా పనిచేస్తోంది. మూడు సంవత్సరాల క్రితం వీరిద్దరూ వివాహం చేసుకున్నారు. బెంగళూరులో ఉద్యోగాలు చేస్తూ ఇటీవల సొంత ఇల్లు కూడా నిర్మించుకుని ఆనందంగా జీవిస్తున్నారు.
రెండు రోజుల క్రితం అనురాగ్ తన భార్య ఐశ్వర్యతో కలిసి తల్లిదండ్రులను చూడటానికి ఆదోనికి వచ్చాడు. అనంతరం బెంగళూరుకు తిరుగు ప్రయాణంలో బళ్లారిలో ఉన్న ఐశ్వర్య తల్లిదండ్రులను పలకరించి వెళ్లాలని నిర్ణయించుకున్నారు.
ఈ క్రమంలో బుధవారం సాయంత్రం కారులో ప్రయాణిస్తున్న సమయంలో కర్ణాటక రాష్ట్రం మోకా సమీపంలోని శివపుర గ్రామశివారులో కర్ణాటక ఆర్టీసీ బస్సు వారి కారును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఐశ్వర్య అక్కడికక్కడే మృతి చెందింది. తీవ్రంగా గాయపడిన అనురాగ్‌ను స్థానికులు వెంటనే బళ్లారి ఆసుపత్రికి తరలించారు. అక్కడి వైద్యులు మెరుగైన చికిత్స కోసం బెంగళూరుకు తరలించాలని సూచించగా, మార్గమధ్యలోనే అనురాగ్ మృతి చెందాడు.
మృతదేహాలకు బళ్లారిలో పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం గురువారం ఆదోనికి తరలించారు. అనంతరం పట్టణంలో అంత్యక్రియలు నిర్వహించారు. ఒక్కగానొక్క సంతానాన్ని కోల్పోయిన రెండు కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది. తిరుమలనగర్ కాలనీలో ఈ ఘటన తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది.
