ఆత్మీయ పలకరింపు ఆర్థిక భరోసా లతో అనందహేళ..

తొలిపొద్దులోనే లబ్ధిదారులకు ఎన్టీఆర్ భరోసా పంపిణీ..
జిల్లాలో 2,25,887 మంది లబ్ధిదారులకు రూ. 99 కోట్ల పంపిణీ..
సామాజిక భద్రతా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డా. జి. డా.లక్ష్మీశ.
విజయవాడ, ఆంధ్రప్రభ: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఎన్టీఆర్ భరోసా పింఛన్లు లబ్ధిదారుల జీవితాల్లో ఆర్థిక భరోసాను నింపుతున్నాయని జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీశ తెలిపారు. ప్రభుత్వం కల్పిస్తున్న సామాజిక భద్రతతో పాటు అధికారుల ఆత్మీయ పలకరింపులు లబ్ధిదారుల ముఖాల్లో ఆనందాన్ని తీసుకొస్తున్నాయని పేర్కొన్నారు.
సామాజిక భద్రతా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో భాగంగా సోమవారం తెల్లవారుజామున విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ సర్కిల్-2 పరిధిలోని మారుతీనగర్ 26వ స్వర్ణ వార్డులో జిల్లా కలెక్టర్ స్వయంగా లబ్ధిదారులకు పింఛన్లు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా గుడిసేవ సుబ్బారావు, వసంతాల శ్రీనివాసరావు, బత్తుల కృష్ణారావులకు వృద్ధాప్య పింఛన్లు, కోమటి నాగమణికి వితంతు పింఛన్, బి. బాల మణికంఠ సాయి శ్రీనివాసుకు విభిన్న ప్రతిభావంతుల పింఛన్ అందజేశారు.
లబ్ధిదారులను ఆప్యాయంగా పలకరిస్తూ వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్న కలెక్టర్, కొంతసేపు వారితో ముచ్చటించి ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలపై అభిప్రాయాలను తెలుసుకున్నారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ, సంక్షేమ పథకాల అమలులో ఆంధ్రప్రదేశ్ దేశానికే ఆదర్శంగా నిలుస్తోందన్నారు. వృద్ధులు, వితంతువులు, విభిన్న ప్రతిభావంతులు, డప్పు కళాకారులు, మత్స్యకారులు, ట్రాన్స్‌జెండర్లు, నిరుపేద కుటుంబాలకు సామాజిక భద్రతా పింఛన్లు ఆర్థిక అండగా నిలుస్తున్నాయని చెప్పారు.
ప్రతి నెల ఒకటో తేదీ వేకువజామునే స్వర్ణ గ్రామం, స్వర్ణ వార్డు సిబ్బంది లబ్ధిదారుల ఇళ్ల వద్దకు వెళ్లి పింఛన్లు అందజేస్తుండటంతో వారి ముఖాల్లో ఆనందం వెల్లివిరుస్తోందని తెలిపారు.
జిల్లాలో మొత్తం 2,25,887 మంది లబ్ధిదారులకు రూ.99,01,45,500 పింఛన్ మొత్తాన్ని పంపిణీ చేసినట్లు కలెక్టర్ వెల్లడించారు. ఇంటి వద్దకే పింఛన్లు అందించడం వల్ల లబ్ధిదారులు సౌకర్యవంతమైన సేవలు పొందుతున్నారని చెప్పారు.
క్షేత్రస్థాయిలో అధికారులు సమన్వయంతో పనిచేస్తూ పింఛన్ల పంపిణీ సజావుగా జరిగేలా చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు. ఎలాంటి అవకతవకలకు తావులేకుండా, పూర్తి పారదర్శకతతో ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం లబ్ధిదారుల ఇళ్ల వద్దే పింఛన్ మొత్తాన్ని అందజేస్తున్నామని పేర్కొన్నారు.
కార్యక్రమంలో డీఆర్‌డీఏ పీడీ ఏ.ఎన్.వి. నాంచారరావు, వీఎంసీ జోనల్ కమిషనర్ కె. ప్రభుదాస్, మున్సిపల్ కార్పొరేషన్ సిబ్బంది పాల్గొన్నారు.
