Rental Vehicles | సచివాలయం వద్ద యజమానుల ఆందోళన

రూ.170 కోట్ల పెండింగ్ బిల్లులు విడుదల చేయాలని డిమాండ్..
రాష్ట్రవ్యాప్తంగా 5 వేలకుపైగా వాహనాలు నిలిపివేత..
అద్దె పెంపు, బిల్లుల చెల్లింపుపై ప్రభుత్వానికి విజ్ఞప్తి

Rental Vehicles | ఆంధ్ర‌ప్ర‌భ వెబ్‌డెస్క్ : పెండింగ్‌లో ఉన్న అద్దె వాహనాల బిల్లులు చెల్లించాలని డిమాండ్ చేస్తూ రాష్ట్రవ్యాప్తంగా అద్దె వాహనాల యజమానులు సమ్మెకు దిగారు. సుమారు రూ.170 కోట్ల బకాయిలను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని కోరుతూ సచివాలయం మీడియా పాయింట్ వద్ద నిరసన చేపట్టారు.

రాష్ట్ర ప్రభుత్వ శాఖల అధికారులు, కార్యాలయాలకు అద్దె ప్రాతిపదికన వాహనాలు నడుపుతున్న యజమానులు ఈ ఆందోళనలో పాల్గొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 18 నెలలుగా అద్దె బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయని, దీంతో తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని వారు ఆవేదన వ్యక్తం చేశారు.

రాష్ట్రవ్యాప్తంగా 5 వేలకు పైగా అద్దె వాహనాల సేవలు నిలిచిపోయినట్లు యజమానులు తెలిపారు. పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలను దృష్టిలో ఉంచుకుని ప్రస్తుతం చెల్లిస్తున్న నెలవారీ అద్దెను రూ.34 వేల నుంచి రూ.55 వేలకు పెంచాలని డిమాండ్ చేశారు.

అద్దె బిల్లులను ప్రతి నెలా 5వ తేదీ నుంచి 10వ తేదీలోపు చెల్లించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. బిల్లులు సకాలంలో అందకపోవడంతో డీజిల్ ఖర్చులు, డ్రైవర్ల వేతనాలు, వాహనాల ఇన్సూరెన్స్, బ్యాంకు ఈఎంఐలు చెల్లించలేక సొంత డబ్బులతో నిర్వహణ కొనసాగిస్తున్నామని తెలిపారు.

ఈఎంఐలు చెల్లించకపోవడంతో బ్యాంకుల నుంచి నోటీసులు వస్తున్నాయని, వాహనాలు జప్తు చేసే పరిస్థితి ఏర్పడిందని యజమానులు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం స్పందించి పెండింగ్ బిల్లులను వెంటనే విడుదల చేయాలని, అద్దె పెంపుపై నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేశారు.