YS Jagan | భీమవరం సభలో.. కింద పడబోయిన జగన్..
YS Jagan | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి భారీ ప్రమాదం తప్పింది. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో నిర్వహించిన ‘ఆక్వా రైతుల ముఖాముఖి’ సభలో ఈ అపశ్రుతి చోటుచేసుకుంది. వైఎస్ జగన్ సభా వేదికపైకి వస్తున్న సమయంలో ఆయనను చూసేందుకు అభిమానులు, కార్యకర్తలు ఒక్కసారిగా ముందుకు దూసుకొచ్చారు. దీంతో అక్కడ తీవ్ర తోపులాట జరిగింది. జనాల ఒత్తిడి పెరగడంతో బ్యారికేడ్ల వద్ద పరిస్థితి అదుపు తప్పినట్లు కనిపించింది.
ఈ క్రమంలో బ్యారికేడ్ల ఒత్తిడికి జగన్ ఒక్కసారిగా నియంత్రణ కోల్పోయి కింద పడబోయారు. అయితే ఆయన వెనుకే ఉన్న వ్యక్తిగత భద్రతా సిబ్బంది వెంటనే అప్రమత్తమయ్యారు. జగన్‌ను గట్టిగా పట్టుకుని కింద పడకుండా నిలువరించడంతో పెను ప్రమాదం తప్పింది.
అనంతరం భద్రతా సిబ్బంది అక్కడున్న కార్యకర్తలు, అభిమానులను నియంత్రించి జగన్‌ను సురక్షితంగా వేదికపైకి తీసుకెళ్లారు. ఈ ఘటనతో కొద్దిసేపు సభా ప్రాంగణంలో కలకలం నెలకొంది. అనంతరం ఆక్వా రైతుల ముఖాముఖి సభలో మాట్లాడిన వైఎస్ జగన్.. కూటమి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. రాష్ట్రంలోని ఆక్వా రైతులను చంద్రబాబు ప్రభుత్వం నట్టేట ముంచుతోందని ఆరోపించారు.
ఆక్వా ఉత్పత్తులకు ధరల స్థిరీకరణ లేకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని జగన్ పేర్కొన్నారు. విద్యుత్ రాయితీలు అందించకుండా ఆక్వా రంగాన్ని సంక్షోభంలోకి నెట్టేస్తున్నారని విమర్శించారు. ఆక్వా రైతుల సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు.
