Weather | తెలంగాణ‌లో ఇప్ప‌ట్లో వ‌ర్షాలు లేన‌ట్టే..!

రాబోయే రెండు వారాల్లో మోస్తరు నుంచి తక్కువ వర్ష సూచనలు
జూలై చివర్లో మార్పులపై ఆశలు
బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం..
దిశ మారితే రాష్ట్రానికి భారీ వర్షాలు కురిసే ఛాన్స్

Weather | ఆంధ్ర‌ప్ర‌భ వెబ్‌డెస్క్ : తెలంగాణ రాష్ర్టంలో వ‌ర్షాల కోసం నిరీక్ష‌ణ త‌ప్పేలా లేదు. మ‌రో రెండు వారాల వ‌ర‌కు వాన జాడ లేన‌ట్టే. తెలంగాణలో రాబోయే 15 రోజుల వాతావరణ పరిస్థితులపై తాజా అంచనాలు ఆసక్తికరంగా ఉన్నాయి. వచ్చే రెండు వారాల్లో తెలంగాణ రాష్ట్రంలో వర్షాలకు అవకాశాలు తక్కువగా ఉన్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది.

జూలై 13 నుంచి 15 వరకు రాష్ట్రంపై పొడి గాలుల ప్రభావం ఉండే అవకాశం ఉందని, దీంతో ఎక్కువ ప్రాంతాల్లో వేడి, పొడి వాతావరణం కొనసాగుతుందని అంచనా. ఈ సమయంలో వర్షాలు చాలా తక్కువగా లేదా అసలు లేకపోవచ్చని వాతావరణ నిపుణులు సూచిస్తున్నారు.

జూలై 15 నుంచి 21 వరకు తెలంగాణలోని పలు ప్రాంతాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. అయితే ఈ వర్షాలు విస్తృతంగా కాకుండా అక్కడక్కడ మాత్రమే నమోదయ్యే అవకాశాలు ఉన్నట్లు అంచనా.

జూలై 21 నుంచి 25 మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే సూచనలు ఉన్నాయి. అయితే ప్రస్తుత అంచనాల ప్రకారం ఈ అల్పపీడనం ఉత్తర-మధ్య భారతం వైపు కదిలే అవకాశం ఉందని, దాని దిశ మారితే తెలంగాణకు ప్రయోజనం చేకూరే అవకాశం ఉందని వాతావరణ పరిశీలనలు చెబుతున్నాయి.

జూలై 25 నుంచి 28 వరకు రాష్ట్రంలో మేఘావృత వాతావరణం కొనసాగుతూ, కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి జల్లులు పడే అవకాశం ఉంది. ఇక జూలై 28 నుంచి ఆగస్టు 16 మధ్య కాలంలో తెలంగాణలో విస్తృత వర్షాలకు అనుకూల పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉందని దీర్ఘకాలిక అంచనాలు సూచిస్తున్నాయి. హైదరాబాద్ సహా పలు ప్రాంతాల్లో మంచి వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని అంచనా.

ప్రస్తుతం జూలై నెల ముగింపు వరకు వర్షాల పరిస్థితి ఆశించిన స్థాయిలో లేకపోవచ్చని అంచనాలు ఉన్నప్పటికీ, అల్పపీడనం దిశలో మార్పులు వస్తే పరిస్థితి మెరుగుపడే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు.