డిజిటలైజేషన్‌లో రాజకీయ పార్టీల ఏజెంట్లు చురుకుగా వ్యవహరించాలి: ఆర్డీవో

ఉమ్మడి వరంగల్ (ఆంధ్రప్రభ): ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ–2026 కార్యక్రమంలో భాగంగా ఎన్యుమరేషన్ ఫారాల సేకరణ, డిజిటలైజేషన్ ప్రక్రియను వేగవంతం చేయడంలో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల బూత్ లెవల్ ఏజెంట్లు కీలక పాత్ర పోషించాలని జిల్లా ఎన్నికల నమోదు అధికారి, ఆర్డీవో కృష్ణవేణి సూచించారు. బుధవారం నిర్వహించిన సమావేశంలో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఆమె ప్రత్యేకంగా సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, జిల్లాలో ఎన్యుమరేషన్ ఫారాల డిజిటలైజేషన్ పూర్తి చేసేందుకు కేవలం వారం రోజుల గడువు మాత్రమే మిగిలి ఉన్నందున ప్రజలను చైతన్యపరుస్తూ బీఎల్‌ఏలు, బీఎల్‌వోలు పరస్పర సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ఇంటింటికీ వెళ్లి ఎన్యుమరేషన్ ఫారాలను సేకరించి సంబంధిత బీఎల్‌వోలకు అందజేయడం ద్వారా నిర్ణీత గడువులోగా డిజిటలైజేషన్ పూర్తి చేయాలని కోరారు.

ములుగు మున్సిపాలిటీతో పాటు గోవిందరావుపేట మండలం పసర, ఏటూరునాగారం మండలం ఏటూరునాగారం, మంగపేట మండలం కమలాపూర్ గ్రామాల పరిధిలోని పోలింగ్ కేంద్రాల్లో ఎన్యుమరేషన్ ఫారాల డిజిటలైజేషన్ పురోగతిపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు. ఆయా ప్రాంతాల్లోని రాజకీయ పార్టీల బూత్ లెవల్ ఏజెంట్లు మరింత చొరవ చూపి ప్రక్రియను వేగవంతం చేయాలని సూచించారు. సమావేశంలో ఏఈఆర్‌వో, తహసీల్దార్ విజయభాస్కర్, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.