ReimsCessna F172 | చావు అంచుల్లో నిలబడి విధిని ఓడించింది!

ReimsCessna F172 | చావు అంచుల్లో నిలబడి విధిని ఓడించింది!

ReimsCessna F172 | ఆల్ప్స్ పర్వతాల్లో షాకింగ్ ఘటన
పారాగ్లైడర్‌ను ఢీకొట్టిన విమానం
సెకన్లలో తీసుకున్న సాహసోపేత నిర్ణయం
బ్యాకప్ పారాచూట్‌తో ప్రాణాపాయం నుంచి బయటపడిన మహిళ
సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన వీడియో

ReimsCessna F172 | ఆంధ్రప్రభ, వెబ్‌ డెస్క్‌ : ఊహించడానికే ఒళ్లు గగుర్పొడిచే ప్రమాదం అది. భూమికి వేల అడుగుల ఎత్తులో ప్రశాంతంగా గాల్లో తేలిపోతున్న సమయం.. అంతలోనే యమదూతలా దూసుకొచ్చింది ఒక విమానం! రెక్క తగిలి పారాచూట్ కాస్తా మధ్యలోకి చీలిపోయింది. క్షణాల్లో ప్రాణాలు గాల్లో కలిసిపోతాయనుకున్న వేళ.. ఆ 44 ఏళ్ల మహిళ చేసిన సాహసం ఇప్పుడు సోషల్‌ మీడియాను షేక్ చేస్తోంది. హాలీవుడ్ యాక్షన్ సినిమాను తలపించే ఈ షాకింగ్ రియల్ ఇన్సిడెంట్ ఆస్ట్రియాలోని ఆల్ప్స్ పర్వత శ్రేణుల్లో వెలుగుచూసింది.

అసలు ఏం జరిగిందంటే..?
ఆస్ట్రియాలోని సాల్జ్‌బర్గ్‌కు సమీపంలో ఉన్న పీసెన్‌డార్ఫ్ పర్వత ప్రాంతం అది. పారాగ్లైడింగ్‌కు పెట్టింది పేరైన ‘స్మిట్టెన్‌హోహే’ శిఖరం నుండి ఒక ఆస్ట్రియన్ మహిళా పారాగ్లైడర్ గాల్లోకి ఎగిరింది. చుట్టూ మంచు కొండలు, చల్లని గాలి.. ఆమె ఎంతో హ్యాపీగా ఆ ప్రకృతిని ఆస్వాదిస్తూ తన హెల్మెట్ కెమెరాతో వీడియో రికార్డ్ చేసుకుంటోంది.

కానీ, సరిగ్గా అదే సమయంలో వెనుక నుండి ఒక రీమ్స్-సెస్నా F172 అనే చిన్న పర్యాటక విమానం దూసుకొచ్చింది. ఆ విమానం నడుపుతున్న పైలట్ ఈమెను గమనించలేదేమో.. విమానం వింగ్స్ (రెక్కలు) నేరుగా వచ్చి ఆమె పారాచూట్ కానోపీని (పైన ఉండే గుడ్డ భాగాన్ని) బలంగా ఢీకొట్టాయి.

మృత్యువుతో పోరాటం..
విమానం తగిలిన దెబ్బకు పారాచూట్ గుడ్డ ముక్కలైపోయింది. గాలిని నిలిపి ఉంచే సపోర్ట్ పోవడంతో ఆమె గాల్లో కంట్రోల్ తప్పి, నిమిషానికి వందల అడుగుల వేగంతో కిందకు పడిపోవడం ప్రారంభించింది. పైగా విమానం తగిలిన ఫోర్స్‌కు గాల్లోనే బొంగరాల గిరగిరా తిరగడం స్టార్ట్ చేసింది. సాధారణంగా ఇలాంటి టైమ్‌లో ఎవరైనా సరే భయంతో చేతులెత్తేస్తారు. కానీ ఆ మహిళ గుండె ధైర్యం మామూలుది కాదు!

కింద పడిపోవడానికి ఉన్న ఆ కొన్ని సెకన్ల వ్యవధిలోనే.. గాల్లో తలకిందులుగా తిరుగుతూనే, ఆమె అత్యంత చాకచక్యంగా తన సీటు కింద ఉండే ‘ఎమర్జెన్సీ బ్యాకప్ పారాచూట్’ ను లాగి గాల్లోకి విసిరింది!

చావును జయించి..
ఆమె అదృష్టం బాగుండి సరిగ్గా ల్యాండ్ అయ్యే కొద్ది సెకన్ల ముందు ఆ బ్యాకప్ పారాచూట్ ఓపెన్ అయ్యింది. దాంతో కిందపడే వేగం కాస్త తగ్గింది. చివరకు ఆమె పర్వత ప్రాంతంలోని దట్టమైన అడవిలో ఉన్న ఒక పెద్ద చెట్టుపై పడింది. ఆ చెట్ల కొమ్మలు ఆమె పతనాన్ని అడ్డుకోవడంతో భూమికి నెమ్మదిగా తాకింది.

ఇంత పెద్ద ప్రమాదం జరిగినా, కేవలం ఒంటి నొప్పులు, చిన్న గీతలు తప్ప ఆమెకు ఒక ఎముక కూడా విరగకపోవడం గమనార్హం. కింద పడగానే ప్రాణాలతో ఉన్నానని నమ్మలేకపోయిన ఆ మహిళ.. షాక్ నుండి తేరుకుని ఊపిరి పీల్చుకుంది. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో మిలియన్ల వ్యూస్‌తో దూసుకుపోతోంది. మరోవైపు ఆమెను ఢీకొట్టిన విమానం సురక్షితంగా సమీపంలోని విమానాశ్రయంలో ల్యాండ్ అయ్యింది.

CLICK HERE TO READ యువతి ఇంటిపై ఉన్మాది వీరంగం

CLICK HERE TO READ MORE