Ap Cm Keynote : వైకుంఠపాళి కావొద్దు Andhra Prabha SPL News
Ap Cm Keynote : వైకుంఠపాళి కావొద్దు Andhra Prabha SPL News
- అభివృద్ధిపై ఏపీ సీఎం కీలక వ్యాఖ్య
- రైతులకు కొత్త పట్టాదారు పుస్తకాలు పంపిణీ
- రెవెన్యూ శాఖ అస్తవ్యస్తం
- బ్లాక్‌చెయిన్ టెక్నాలజీలో భూ రికార్డులు
- కర్నూలులో డ్రోన్ సిటీ..
- అనంతపురంలో ఎయిరోస్పేస్ హబ్
- రాయలసీమ హార్టికల్చర్ హబ్
- అన్నీ కుంభకోణాలు.. వివాదాలే
- గత పాలకులపై తీవ్ర ఆరోపణలు
- కరెంట్ ఛార్జీలు పెంచబోం
- తిరుమల అపవిత్రం ఉపేక్షించం
( ఆంధ్రప్రభ, ఏపీ న్యూస్ నెట్ వర్క్ ప్రతినిధి)

నేను కష్టపడేది పేదల కోసమే. పేదలకు అండగా ఉంటా. ఎన్ని ఆర్థిక విధ్వంసాలు జరిగినా.. అభివృద్ధి , సంక్షేమానికి ఆటంకం లేకుండా.. ఏపీనీ అభివృద్ధి పట్టాలెక్కించాం, ఇక అన్నీ ఆయన బాగానే చేశాడు, మరో వ్యక్తికి చాన్సు ఇద్దామనుకుంటే… అంత ఎత్తుకు ఎదిగిన అభివృద్ధి అంతకంటే కిందికి జారిపోతుంది, అందుకే ఏపీ అభివృద్ధి వైకుంఠ పాళి కాకూడదు., అని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. డోన్ నియోజకవర్గం, కొత్త బురుజులో సోమవారం పట్టాదారు పాసుపుస్తకాల పంపిణీ కార్యక్రమంలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. అంతక ముందు సభా వేదిక సమీపంలో మైనింగ్, భూగర్భ జలాలు, వాటర్ షేడ్స్, పర్యాటకం, ఉద్యాన, ఆర్ అండ్ బీ శాఖ స్టాల్ల్స్ ను సీఎం పరిశీలించారు. అనంతరం ఆయన ప్రసంగిస్తూ…
Ap Cm Keynote : రెవెన్యూ శాఖ అస్తవ్యస్తం

గత ప్రభుత్వం వల్ల రెవెన్యూ శాఖను అస్తవ్యస్తం చేసేసింది. డోన్ లో మంత్రిగా ఉన్న వ్యక్తి ఒక సాధారణ రైతు భూమిని తన అనుచరులకు కట్టబెట్టేశారు. గత ప్రభుత్వం 1.95 కోట్ల ఎకరాలను 22ఏలో పెట్టారు. ప్రైవేట్ భూముల్ని ఇష్టానుసారంగా చేశారు. అడిగిన భూమి ఇవ్వకపోతే వాటిని 22ఏలో పెట్టేసేలా గత ప్రభుత్వం వ్యవహరించింది.

ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ తెచ్చి ప్రైవేట్ భూములపై అజమాయిషీని సొంత వాళ్లకు కట్టబెట్టాలని చూశారు. అప్పీల్ కు వెళ్లడానికి వీలు లేకుండా చేయాలని చూశారు. ఇదే జిల్లాలో పాణ్యం నియోజకవర్గంలో పట్టాదారు పుస్తకాన్ని కాల్చి ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ రద్దు చేస్తామని హామీ ఇచ్చాను. అధికారంలోకి రాగానే ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ రద్దు చేశాం. భూ రికార్డుల్లో తప్పులను సరిదిద్దుతున్నాం. వారసత్వంగా వచ్చిన భూములు, సొంత శ్రమతో కొనుగోలు చేసిన భూములకు చెందిన పుస్తకాలపై ఫోటోలు వేసుకున్నారు. ఫోటోల పిచ్చితో జీవితాలతో ఆడుకునే పరిస్థితికి వచ్చారు. సర్వే రాళ్లపైనా ఫోటోలు ముద్రించుకున్నారు… రూ.750 కోట్లు ఫోటోలకు ఖర్చు చేశారు. నేను ఎక్కడెళ్లినా భూ సమస్యలపై కట్టకట్టలు అర్జీలు వచ్చాయి.వాళ్లు చేసిన ఒక దుర్మార్గాన్ని సరిదిద్దడానికి 20 నెలలు పట్టింది. అని సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు.
Ap Cm Keynote : రైతుల ఆమోదంతోనే.. అన్నీ

రైతుల సమక్షంలోనే భూ కొలతలు తీసుకుని రైతుల ఆమోదంతో భూ వివరాలతో పుస్తకాలు ఇస్తున్నాం భూ రికార్డులు తారుమారు చేయకుండా పక్కాగా పట్టా ఇస్తున్నాం.క్యూఆర్ కోడ్ విధానం తీసుకొచ్చాం. ఎవరు రికార్డులు తారుమారు చేసినా తెలిసిపోతుంది. ఎమ్మార్వో, వీఆర్వోలు తప్పు చేసినా బ్లాక్ చెయిన్ టెక్నాలజీ ద్వారా తెలిసిపోతుంది. మేం ఇచ్చిన పట్టాదార్ పుస్తకాలను ట్యాంపర్ చేయలేరు. రూపాయి అవినీతి లేకుండా కొత్త పట్టాదార్ పాసు పుస్తకాలు ఇస్తున్నాం. ఎవరూ ఒక్క రూపాయి కూడా ఇవ్వాల్సిన అవసరం లేకుండా పట్టా ఇప్పించే బాధ్యత నాది, అని సీఎం హామీ ఇచ్చారు.
అన్నీ తప్పుడు తడకలే

16,816 గ్రామాలున్నాయి. 6,860 గ్రామాల్లో సర్వే గత ప్రభుత్వంలో చేశారు. తప్పుల తడకతో 19.93 లక్షల పుస్తకాలు ఇచ్చారు. రికార్డులు తారుమారు చేసి ఇచ్చారు. అవన్నీ పక్కనపెట్టేసి మళ్లీ కొత్తగా రైతులకు పుస్తకాలు అందిస్తున్నాం. గత పాలకులు చేసిన తప్పును సరిదిద్దుతూ ప్రభుత్వమే ఉచితంగా పట్టాలు ఇస్తోంది.

రిజిస్ట్రేషన్ విధానం కూడా సులభతరం చేస్తున్నాం. గత ప్రభుత్వం రాష్ట్రాన్ని విధ్వంసం చేసింది. మూడు పార్టీలు కలిసి కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేశాం.రాష్ట్రానికి పూర్వవైభవాన్ని తీసుకొస్తామన్న మా మాటను నమ్మి అధికారం ఇచ్చారు. నంద్యాల జిల్లాలో పార్లమెంట్ సహా 8 మందిని గెలిపించారు. సీమలో 7 సీట్లు తప్ప అన్నింటా కూటమి అభ్యర్థులను గెలిపించారు. ప్రజాహితం కోసం కూటమి ప్రభుత్వం పని చేస్తోంది, అని సీఎం చంద్రబాబు వివరించారు.
Ap Cm Keynote : ఎన్నో కుంభకోణాలు

గత ప్రభుత్వంలో అన్నీ కుంభకోణాలు, వివాదాలే. 30 వేల మంది కల్తీ మద్యం తాగి గత ప్రభుత్వంలో చనిపోయారు. ఎక్సైజ్ శాఖలో నెలకు రూ.100 కోట్లు అవినీతి చేశారు. పేదల ఆరోగ్యాని కంటే వారికి డబ్బులే ముఖ్యం. ప్రజల జీవితాలు, ఆరోగ్యంతో ఆడుకున్నారు తిరుమల లడ్డూలో వాడే నెయ్యిని కూడా కల్తీ చేశారు. సీమలో ముఠా నాయకులు ఉండేవారు.

ఎన్నికల సమయంలో డబ్బుల కంటే బాంబులు అడిగే పరిస్థితి ఉండేది. ప్రజాస్వామ్యంలో ఇలాంటి దౌర్బగ్యాలు ఉండకూడదని… ఈ ప్రాంతంలో ముఠా తగాదాలను తుదముట్టించాం. ముఠాలు వద్దు గ్రామాల్లో ప్రశాంతతే ముద్దు అని చెప్పి నాయకులను కలిపాను, అని సీఎం స్ఫష్టం చేశారు.
Ap Cm Keynote : ప్రతి ఎకరాకు సాగునీరే లక్ష్యం

గతాన్ని గుర్తు పెట్టుకుంటేనే భవిష్యత్ బాగుంటుంది. డోన్ నియోజకవర్గంలో 30 చెరువులకు హంద్రీనీవా ద్వారా నీళ్లు ఇచ్చాం. హంద్రీనీవాను ప్రారంభించింది ఎన్టీఆర్. సీమలో హంద్రీనీవా, నగరి గాలేరు, ఎస్ఆర్బీసీ, తెలుగు గంగకు ఎన్టీఆర్ శ్రీకారం చుడితే… వీటిని పూర్తి చేసే అదృష్టం నాకు దక్కింది. భగీరథుని స్పూర్తితో సీమలో ప్రతీ ఎకరాకు నీళ్లివ్వాలనేది నా సంకల్పం. అన్నీ రిజర్వాయర్లలో నీరు ఉండాలి.. పొలాలన్నీ పచ్చగా ఉండాలి. సీమను ఉద్యాన వనంగా చేస్తాం. రాయలసీమ ఉత్పత్తులను దేశ స్థాయికి పంపి, మెరుగైన వెరైటీస్ ఇక్కడికి తీసుకొస్తాం, అని చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు.
Ap Cm Keynote : కర్నూలులో డ్రోన్ సిటీ

తల్లికి వందనం కింద ఎంతమంది పిల్లలున్నా రూ.15 వేలు ఇస్తున్నాం. స్త్రీ శక్తి ద్వారా ఇప్పటి వరకు మహిళలు ఉచితంగా 50 కోట్ల ప్రయాణాలు చేశారు. ప్రజల కోసమే ఈ ప్రభుత్వం అందుబాటులో ఉంటుంది. గత ప్రభుత్వంలో ఎక్కడచూసినా గుంతల రోడ్లే… నంద్యాల జిల్లాలో ఆర్ అండ్ బీ రోడ్లపై గుంతలు లేకుండా చేశాం. పంచాయతీ రాజ్ రోడ్లలో గుంతలు లేకుండా చేస్తాం. రూ.4 వేల కోట్లు పంచాయతీ రోడ్లకు కేటాయిస్తున్నాం. రాష్ట్రానికి పెట్టుబడులు పెద్ద ఎత్తున వస్తున్నాయి. కర్నూలులో డ్రోన్ సిటీ ఏర్పాటు చేస్తున్నాం. అనంతపురంను ఎయిరో స్పేస్ సిటీగా చేస్తాం , ఏసీ సీఎం హామీ ఇచ్చారు.
Ap Cm Keynote : కరెంటు చార్జీలు పెంచం

గత ప్రభుత్వంలో 8 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచి రూ.32 వేల కోట్ల భారం ప్రజలపై వేశారు. కరెంట్ ఛార్జీలు పెంచబోమని చెప్పాం… రాసిపెట్టుకోండి… కరెంట్ ఛార్జీలు పెంచే ప్రసక్తే లేదు. వాట్సాప్ ద్వారా సేవలు అందిస్తున్నాం. అవసరమైన సేవలు వాట్సాప్ ద్వారానే పొందొచ్చు. లక్ష మంది మహళా పారిశ్రామిక వేత్తలతో ఎంఎస్ఎంఈలను ఏర్పాటు చేశాం. మరో 5 లక్షల మంది మహిళలను పారిశ్రామిక వేత్తలుగా తీర్చిదిద్దుతాం. పేదలను ఆదుకునేందుకు పీ4 విధానం తీసుకొచ్చాం.
Ap Cm Keynote : ఇక సీమ హార్టికల్చర్ హబ్

మామిడికి రేటు తగ్గితే కేజీకి రూ.4లు సబ్సీడీ ఇచ్చాను. 50 శాతం మామిడి పండ్లకు తొడిగే కవరుకు సబ్సీడీ ఇస్తున్నాం. కవరు తొడిగిన పండ్లకు రూ.40 వేల దాకా వస్తున్నాయి. ఇంటర్నేషనల్ మార్కెట్లో టన్నుకు రూ.1.70 లక్షలు వస్తున్నాయి. సీమను హార్టికల్చర్ హబ్ గా మారుస్తాం. కేంద్రం రూ.30 వేల కోట్లు పూర్వోదయ పథకం కింద ఇస్తుంది, అని సీఎం చంద్రబాబు వివరించారు.
Ap Cm Keynote : తిరుమల అపవిత్రం ఉపేక్షించం

తిరుమల లడ్డూ కల్తీ, మద్యం అవినీతి, భూ దోపిడీ వంటి వాటిపై ప్రక్షాళన చేస్తున్నాం… వాటిపైనా తప్పుడు ప్రచారం చేస్తున్నారు లడ్డూ విషయంలో సీబీఐ ఇచ్చిన రిపోర్టుపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు. వేంకటేశ్వరస్వామికి అపవిత్రం చేస్తే నేను ఉపేక్షించను… ఎవరు చేసినా ఒప్పుకోను. వివేకా నందరెడ్డిని హత్య చేసి నా చేతిలోనే కత్తిపెట్టి నారాసుర రక్త చరిత్ర అని రాశారు. నేరాలు ఘోరాలు చేశారు. జగన్ చేసిన అన్యాయాన్ని ఆయన సోదరి సునీత తెలుసుకున్నారు. తిరుమల లడ్డుపైనా రాజకీయం చేసి తప్పును కప్పి పుచ్చుకునేందుకు ఎదురుదాడి చేస్తున్నారు, ఏపీ సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.
ALSO READ : Maternity Leave Men AP : మగాళ్లకూ మెటర్నిటీ లీవ్ AP SPl News
