Redhills | ఏసీబీ సోదాల్లో కోట్ల ఆస్తుల వెలుగులోకి

Redhills | ఏసీబీ సోదాల్లో కోట్ల ఆస్తుల వెలుగులోకి

Redhills | ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్‌ : హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై అండ్ సీవరేజ్ బోర్డు (జలమండలి) రెడ్‌హిల్స్ ప్రాజెక్ట్ డివిజన్-8 జనరల్ మేనేజర్ లక్ష్మీకుమార్‌పై నమోదైన అక్రమాస్తుల కేసులో కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. అనంతరం అధికారులను ఆయనను చంచల్‌గూడ జైలుకు తరలించారు.

ఆదాయానికి మించిన ఆస్తులు కూడబెట్టినట్లు వచ్చిన ఆరోపణలతో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు మే 19న (నిన్న) లక్ష్మీకుమార్‌ను అరెస్ట్ చేశారు. హైదరాబాద్‌తో పాటు మొత్తం 8-9 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు నిర్వహించారు. మల్లాపూర్‌లోని ఆయన నివాసంలో దాదాపు 10 గంటల పాటు తనిఖీలు కొనసాగాయి.

సోదాల్లో రూ.1.10 కోట్ల నగదు, సుమారు 2.1 కిలోల బంగారు ఆభరణాలు, 9.2 కిలోల వెండి వస్తువులు, ఒక మారుతి రిట్జ్ కారు, బజాజ్ బైక్‌ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

నిజామాబాద్, సంగారెడ్డి జిల్లాల్లో సుమారు 18 ఎకరాల వ్యవసాయ భూములు, హైదరాబాద్‌లో 6 ఓపెన్ ప్లాట్లు, 3 ఫ్లాట్లు, ఒక విలాసవంతమైన ఇంటిని అధికారులు గుర్తించారు. ప్రాథమిక అంచనాల ప్రకారం ఈ ఆస్తుల విలువ రూ.5.88 కోట్లుగా తేలిందని, మార్కెట్ విలువ ఇంకా ఎక్కువగా ఉండే అవకాశముందని ఏసీబీ అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.