పెన్షన్ ఉద్యోగుల ప్రాథమిక హక్కు

  • సీపీఎస్‌ను రద్దు చేసి పాత పెన్షన్ విధానం అమలు చేయాలి..
  • జనజాగరణ యాత్రను విజయవంతం చేయాలి..
  • ఉద్యోగ సంఘం జిల్లా అధ్యక్షుడు పట్నం రాఘవేందర్..

వికారాబాద్, ఆంధ్రప్రభ : పెన్షన్ అనేది ఉద్యోగుల ప్రాథమిక హక్కని, సీపీఎస్‌ను రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని సీపీఎస్ ఉద్యోగ సంఘం జిల్లా అధ్యక్షుడు పట్నం రాఘవేందర్ డిమాండ్ చేశారు. ఈ నెల 19, 20 తేదీల్లో వికారాబాద్ జిల్లాలో నిర్వహించనున్న సీపీఎస్ ఉద్యోగ, ఉపాధ్యాయుల జనజాగరణ యాత్రను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

జూలై 20న వికారాబాద్ పట్టణంలో నిర్వహించనున్న జనజాగరణ యాత్రకు సంబంధించిన పోస్టర్‌ను వికారాబాద్ ఆర్డీవో వాసుచంద్ర, తహసీల్దార్ లక్ష్మీనారాయణ చేతుల మీదుగా జిల్లా కేంద్రంలో బుధవారం ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా పట్నం రాఘవేందర్ మాట్లాడుతూ.. 2004లో ప్రవేశపెట్టిన సీపీఎస్ విధానం కారణంగా గత 22 ఏళ్లుగా ఉద్యోగులు, ఉపాధ్యాయులు తీవ్ర అన్యాయానికి గురవుతున్నారని అన్నారు. పదవీ విరమణ అనంతరం ఉద్యోగులకు సామాజిక భద్రత కల్పించడంలో సీపీఎస్ విధానం విఫలమైందని పేర్కొన్నారు. ఉద్యోగులకు గౌరవప్రదమైన జీవన భరోసా కల్పించాలంటే పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాల్సిందేనని స్పష్టం చేశారు.

కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు సీపీఎస్‌ను రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ డిమాండ్‌తో రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో జనజాగరణ యాత్ర నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఉద్యమ కార్యాచరణలో భాగంగా ఆగస్టు 23న ‘ఛలో హైదరాబాద్’ కార్యక్రమం నిర్వహించనున్నట్లు వెల్లడించారు.

జూలై 19న కొడంగల్, తాండూరు నియోజకవర్గాల్లో, జూలై 20న వికారాబాద్, పరిగి నియోజకవర్గాల్లో జనజాగరణ యాత్ర నిర్వహించనున్నట్లు తెలిపారు. జిల్లాలోని సీపీఎస్ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, వారి కుటుంబ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొని యాత్రను విజయవంతం చేయాలని పట్నం రాఘవేందర్ కోరారు.

ఈ కార్యక్రమంలో టీఎస్‌సీపీఎస్‌ఈయూ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎండీ అయూబ్, రాష్ట్ర బాధ్యులు విజయభాస్కర్ రెడ్డి, వికారాబాద్ డిప్యూటీ తహసీల్దార్, సీపీఎస్ నాయకులు నరేందర్, సంతోష్ కుమార్, ముస్తఫా, వెంకటయ్య, నాగరాజు, భీమప్ప, అశోక్‌తో పాటు ఉద్యోగులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.