ప్రారంభానికి నోచని వాటర్ ట్యాంక్‌పై తీవ్ర ఆగ్రహం

ప్రారంభానికి నోచని వాటర్ ట్యాంక్‌పై తీవ్ర ఆగ్రహం
- మల్లాది విష్ణు హెచ్చరిక
విజయవాడ, ఆంధ్రప్రభ:
విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ పరిధిలో పలు కాలనీల తాగునీటి సమస్య పరిష్కారానికి నిర్మించిన వాటర్ ట్యాంక్‌ను వెంటనే ప్రారంభించాలని మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు డిమాండ్ చేశారు. గత ప్రభుత్వ హయాంలోనే దాదాపు 90 శాతం పనులు పూర్తయినప్పటికీ, ప్రస్తుత ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల రెండేళ్లుగా ఈ ప్రాజెక్టు ప్రారంభానికి నోచుకోలేదని ఆయన ఆరోపించారు.
దావుబుచ్చే కాలనీ, వినాయకనగర్, దేవినగర్ లోని కొంత భాగం, ట్రెండ్ సెట్ మెడోస్ ప్రాంతాల్లో సుమారు 10 వేల మంది జనాభా తాగునీటి సమస్యతో ఇబ్బందులు పడుతున్నారని మల్లాది విష్ణు తెలిపారు. గత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో సుమారు రూ. 5 కోట్ల వ్యయంతో ఈ వాటర్ ట్యాంక్ నిర్మాణం చేపట్టినట్లు ఆయన పేర్కొన్నారు. స్థల సేకరణ కోసం టిడిఆర్ బాండ్లు ఇచ్చి పనులు దాదాపు పూర్తి చేశారని తెలిపారు.
ప్రభుత్వం మారి రెండేళ్లు కావస్తున్నా వాటర్ ట్యాంక్ ప్రారంభించకపోవడం పట్ల ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ, స్థానిక ఎమ్మెల్యే ప్రజల అవసరాలను పట్టించుకోవడం లేదని విమర్శించారు. నగరంలో శానిటేషన్, క్లీన్ అండ్ గ్రీన్ పేరుతో కార్యక్రమాలు జరుగుతున్నా, క్షేత్రస్థాయిలో మౌలిక సమస్యలు పరిష్కారం కావడం లేదని అన్నారు.
అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ కనెక్షన్లు, రోడ్డు పనులు, నీటి సరఫరా వ్యవస్థలపై గతంలో చేపట్టిన పనులు కూడా నెమ్మదిగా సాగుతున్నాయని ఆయన పేర్కొన్నారు. ప్రజల నుంచి పన్నులు వసూలు చేస్తున్న నగరపాలక సంస్థ, ప్రాథమిక అవసరాలు తీర్చడంలో విఫలమైందని విమర్శించారు.
వాటర్ ట్యాంక్‌ను తక్షణమే ప్రారంభించకపోతే కాలనీవాసులతో కలిసి మున్సిపల్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మాజీ డిప్యూటీ మేయర్ శైలజా రెడ్డి, మాజీ కార్పొరేటర్లు, వైఎస్సార్‌సీపీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.
