ప్రజా సంక్షేమమే ప్రధాన లక్ష్యం

ప్రజా సంక్షేమమే ప్రధాన లక్ష్యం

అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్..
ప్రజల ఆరోగ్యం, సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమన్న ఎమ్మెల్యే

విజయవాడ రూరల్, ఆంధ్రప్రభః విజయవాడ రూరల్ మండలం గొల్లపూడి సాయిపురం కాలనీలోని వేములపల్లి బాబు రాజేంద్రప్రసాద్ పార్కు అభివృద్ధి పనులకు మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాద్ ఆదివారం భూమిపూజ చేసి పనులను ప్రారంభించారు. స్థానిక నాయకులు, కాలనీవాసుల సమక్షంలో నిర్వహించిన ఈ కార్యక్రమం ఉత్సాహభరితంగా సాగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పిల్లలు, యువత, వృద్ధులకు ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కల్పించాలనే ఉద్దేశంతో పార్కును అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. పార్కులో వాకింగ్ ట్రాక్, ఓపెన్ జిమ్, చిన్నారుల ఆట స్థలం వంటి సౌకర్యాలను ఏర్పాటు చేసి, పచ్చదనం నడుమ ఆధునిక ప్రమాణాలతో తీర్చిదిద్దనున్నట్లు వెల్లడించారు. పనులు నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా, నిర్ణీత గడువులో పూర్తి కావాలని అధికారులకు సూచించారు. పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు కూటమి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని పేర్కొన్నారు. ప్రజల ఆరోగ్యం, సంక్షేమం, జీవన ప్రమాణాల మెరుగుదలే ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని స్పష్టం చేశారు. సాయిపురం కాలనీవాసుల చిరకాల కోరిక నెరవేరుతున్నందుకు స్థానికులు ఆనందం వ్యక్తం చేశారు. పార్కు అభివృద్ధికి కృషి చేసిన ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాద్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగుతాయని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు, కాలనీవాసులు పాల్గొన్నారు.

Leave a Reply