సింగరేణి భరోసా కాదు.. బీజేపీ ఉనికి కోసం యాత్ర

  • కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డిపై మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి ఘాటు విమర్శలు
  • అన్ని బొగ్గు గనులను షరతులు లేకుండా సింగరేణికే కేటాయించాలని డిమాండ్

ఆంధ్రప్రభ ప్రతినిధి, భూపాలపల్లి : కేంద్రమంత్రి కిషన్ రెడ్డి చేస్తున్న సింగరేణి భరోసా యాత్ర కాదు.. తెలంగాణలో బీజేపీ ఉనికి కోసం చేపట్టిన రాజకీయ యాత్ర అని మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నాయకుడు గండ్ర వెంకటరమణారెడ్డి కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డిపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. చిత్తశుద్ధి ఉంటే కొత్త బొగ్గు గనులన్నింటినీ ఎలాంటి షరతులు లేకుండా సింగరేణికే కేటాయించాలని, ప్రచార యాత్రలతో కార్మికులకు ఎలాంటి ప్రయోజనం ఉండదని స్పష్టం చేశారు. భూపాలపల్లి బీఆర్ఎస్ జిల్లా కార్యాలయంలో బుధవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై విమర్శల వర్షం కురిపించారు.

ఐదేళ్లు కేంద్ర క్యాబినెట్‌లో ఉండి చేసిందేమిటి..?

ఐదేళ్లుగా కేంద్ర క్యాబినెట్‌లో కీలక బాధ్యతలు నిర్వహించిన కిషన్‌రెడ్డి తెలంగాణకు తీసుకొచ్చిన అభివృద్ధి ఏమిటో చెప్పాలని రమణారెడ్డి ప్రశ్నించారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తుందనుకోవడం పగటి కల మాత్రమేనని ఎద్దేవా చేశారు.

మేడిగడ్డపై రాజకీయాలు.. రైతుల భవిష్యత్తుతో ఆటలు

కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజీలో రెండు పిల్లర్లు కుంగిన ఘటనను రాజకీయ దురుద్దేశంతో బీజేపీ, కాంగ్రెస్ ప్రభుత్వాలు ఉపయోగించుకున్నాయని ఆరోపించారు. మరమ్మతులు చేపట్టకుండా దాదాపు 30 నెలలుగా నివేదికల పేరుతో కాలయాపన చేస్తూ రైతుల భవిష్యత్తుతో చెలగాటమాడుతున్నారని మండిపడ్డారు. కేసీఆర్ రైతుల హృదయాల్లో ఉన్నారనే కారణంతోనే పంపులను ఆన్ చేయడం లేదని వ్యాఖ్యానించారు.

తాడిచర్ల గని కొత్త ఘనత కాదు

తాడిచర్ల బొగ్గు గనికి అనుమతి యూపీఏ ప్రభుత్వ హయాంలోనే లభించిందని, దానిని కొత్తగా తామే సాధించామని చెప్పుకోవడం బీజేపీకి తగదని అన్నారు. కేంద్ర విధానాల వల్లే సింగరేణి క్రమంగా అంధకారంలోకి వెళ్తోందని, ఇదే అంశంపై బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ధర్నాలు, అసెంబ్లీలో తీర్మానం చేసినా కేంద్రం స్పందించలేదని విమర్శించారు.

సింగరేణిలో ఉద్యోగాలు తగ్గుతున్నాయి

సింగరేణిలో కేంద్రానికి 49 శాతం, రాష్ట్రానికి 51 శాతం వాటా ఉన్నప్పటికీ కార్మికుల సంఖ్య రోజురోజుకూ తగ్గుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఓపెన్‌కాస్ట్ గనులపైనే సంస్థ ఆధారపడుతోందని పేర్కొన్నారు. కేసీఆర్ హయాంలో డిపెండెంట్ ఉద్యోగాల కోసం మెడికల్ బోర్డు ఏర్పాటు చేసి 15 వేల మందికి ఉపాధి కల్పించామని గుర్తు చేశారు. ఏడాదిన్నరగా మెడికల్ బోర్డు లేకపోవడంతో ఉద్యోగ అవకాశాలు కోల్పోతున్నారని, దీనికి కేంద్రం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

కార్మికుల సమస్యలు పరిష్కరించాలి

సింగరేణి అధికారులు సైతం సమస్యల పరిష్కారం కోసం ధర్నా చేయాల్సిన పరిస్థితి రావడం దురదృష్టకరమన్నారు. కార్మికుల ఆదాయపు పన్ను రద్దు చేయించేందుకు కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి చొరవ తీసుకోవాలని కోరారు. నిజంగా తెలంగాణ బిడ్డనైతే షరతులు లేకుండా అన్ని బొగ్గు గనులను సింగరేణికే కేటాయించాలని సవాల్ విసిరారు.

ప్రజలు గుణపాఠం చెబుతారు

ప్రచారాలతో కాకుండా పనులతోనే ప్రజల విశ్వాసం పొందవచ్చని, మాటలు చెప్పేవారిని ప్రజలు ఇక నమ్మరని రమణారెడ్డి అన్నారు. రానున్న రోజుల్లో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. ఈ సమావేశంలో టీబీజీకేఎస్ రాష్ట్ర అధ్యక్షుడు మిర్యాల రాజిరెడ్డి, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ గండ్ర హరీష్‌రెడ్డి, బడితల సమ్మయ్య, మాడ హరీష్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.