తూకం లేకుండానే రేషన్ డీలర్లకు బియ్యం సరఫరా?

గోదాం ఇన్‌చార్జిలు, కాంట్రాక్టర్ల తీరుపై డీలర్ల ఆందోళన

వర్ని, ఆంధ్రప్రభ: రేషన్ దుకాణాలకు ప్రభుత్వం సరఫరా చేసే బియ్యం రవాణాలో గోదాం ఇన్‌చార్జిలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని డీలర్లు ఆరోపిస్తున్నారు. తూకం వేయకుండానే బియ్యాన్ని సరఫరా చేస్తున్నారని వర్ని, చందూర్, మోస్రా, కోటగిరి, రుద్రూర్ మండలాలకు చెందిన డీలర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ప్రధాన గోదాములు, పౌర సరఫరాల శాఖ గోదాముల నుంచి తూకం వేయకుండా బియ్యం లోడ్ చేసి పంపిస్తున్నారని డీలర్లు వాపోతున్నారు. దీంతో తమకు కేటాయించిన బియ్యం పూర్తిస్థాయిలో అందడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

గోదాం ఇన్‌చార్జిలు, బియ్యం రవాణాకు అనుమతి పొందిన లారీల కాంట్రాక్టర్లు నిబంధనలను పట్టించుకోకుండా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. మూడు నెలలకు సంబంధించిన బియ్యాన్ని ఒకేసారి సరఫరా చేయడంతో పరిమాణంలో తేడాలు వస్తున్నాయని, దీనిపై ఫిర్యాదు చేసినా అధికారులు స్పందించడం లేదని పేర్కొన్నారు.

టెండర్లలో పేర్కొన్న లారీలకు బదులుగా ఇతర వాహనాల ద్వారా బియ్యం రవాణా చేస్తున్నారని కూడా డీలర్లు ఆరోపించారు. ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపి, బాధ్యులైన గోదాం ఇన్‌చార్జిలు, కాంట్రాక్టర్లపై చర్యలు తీసుకోవాలని వారు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.