మోటార్ల ముఠా గుట్టురట్టు.. ఏడుగురు నిందితుల అరెస్ట్

పొన్నూరు రూరల్, ఆంధ్రప్రభ: మండల పరిధిలో రైతుల పొలాల్లో ఏర్పాటు చేసిన నీటి మోటార్ల చోరీలకు పాల్పడుతున్న ముఠాను పొన్నూరు రూరల్ పోలీసులు పట్టుకున్నారు. ఈ కేసులో ఏడుగురు ముద్దాయిలను అరెస్ట్ చేసినట్లు జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు.

మండలంలో రాత్రి సమయాల్లో పొలాల్లో ఉపయోగించే వాటర్ మోటార్లు వరుసగా చోరీకి గురవుతున్నాయని రైతులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదులపై దర్యాప్తు చేపట్టిన పొన్నూరు రూరల్ సీఐ పి. కృష్ణయ్య ప్రత్యేక దృష్టి సారించారు.

దర్యాప్తులో భాగంగా రాత్రి వేళల్లో అనుమానాస్పదంగా సంచరిస్తున్న ఓ క్రెటా కారును పోలీసులు గుర్తించారు. ఆ వాహనం వివరాలను సేకరించి విచారణ చేపట్టగా, తాడికొండ మండలం ఉప్పార ఫణిదారం గ్రామానికి చెందిన తాడిశెట్టి నాగేశ్వరరావు మరికొందరితో కలిసి వాటర్ మోటార్ల దొంగతనాలకు పాల్పడుతున్నట్లు పోలీసులు గుర్తించారు.

ఈ క్రమంలో ప్రధాన నిందితుడు తాడిశెట్టి నాగేశ్వరరావుతో పాటు తాడిశెట్టి వంశీ, ఊటుకూరు చరణ్, షేక్ అఖిల్, మిండల సాంబశివరావు, కటారి సాంబశివరావు, పెద్ద పలకలూరు గ్రామానికి చెందిన మరియప్ప అలియాస్ పెరియాస్వామి (స్క్రాప్ వ్యాపారి)లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

వారిని విచారించగా తెనాలి, చుండూరు, పొన్నూరు రూరల్ పరిసర ప్రాంతాల్లో మొత్తం 91 నీటి మోటార్లను దొంగలించినట్లు నిందితులు అంగీకరించినట్లు ఎస్పీ వకుల్ జిందాల్ తెలిపారు. దొంగలించిన నీటి మోటార్ల విలువ బహిరంగ మార్కెట్‌లో సుమారు రూ.15.47 లక్షలు ఉంటుందని వెల్లడించారు.

నిందితుల నుంచి దొంగలించిన సొత్తుతో పాటు రెండు కార్లు, ఒక ఆటోను పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ తెలిపారు. గుంటూరు జిల్లా వ్యాప్తంగా ఏర్పాటు చేసిన సీసీటీవీ 360 కెమెరాల ద్వారా నిందితుల కదలికలను నిరంతరం పర్యవేక్షిస్తూ కేసు దర్యాప్తు చేసినట్లు పేర్కొన్నారు.

రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్న వాటర్ మోటార్ల చోరీ కేసును సమర్థవంతంగా ఛేదించిన పొన్నూరు రూరల్ పోలీసులను ఎస్పీ అభినందించారు.