అడవుల పునరుద్ధరణకు వినూత్న కార్యక్రమం

గుంటూరు, ఆంధ్రప్రభ: రాష్ట్రంలో తొలిసారిగా డ్రోన్ సాంకేతికతను వినియోగించి అడవుల్లో సీడ్ బాల్స్ వెదజల్లే కార్యక్రమానికి అటవీశాఖ శ్రీకారం చుట్టింది. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు అటవీ ప్రాంతాల్లో పచ్చదనం పునరుద్ధరణ, క్షీణించిన అడవుల అభివృద్ధి లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు జిల్లా అటవీ అధికారి ఎం. హిమ శైలజ తెలిపారు.

గుంటూరు డివిజన్ పరిధిలోని కొండవీడు రిజర్వ్ అటవీ ప్రాంతంలో మంగళవారం డ్రోన్ల ద్వారా సీడ్ బాల్స్ వెదజల్లే ప్రక్రియను ప్రారంభించారు. సాధారణంగా మనుషులు చేరుకోలేని దట్టమైన అటవీ ప్రాంతాల్లోనూ విత్తన బంతులను సమర్థవంతంగా జారవిడిచేందుకు డ్రోన్ సాంకేతికతను వినియోగిస్తున్నట్లు ఆమె వివరించారు.

గుంటూరు అటవీ రేంజ్ పరిధిలో మొత్తం మూడు లక్షల సీడ్ బాల్స్ తయారు చేసి, వాటిని దశలవారీగా డ్రోన్ల సహాయంతో అడవుల్లో వెదజల్లనున్నట్లు తెలిపారు. క్షీణించిన అటవీ ప్రాంతాలను గుర్తించి వాటిలో సహజసిద్ధంగా మొక్కల పెరుగుదలకు అనుకూల వాతావరణం కల్పించే లక్ష్యంతో ఈ కార్యక్రమం చేపట్టినట్లు పేర్కొన్నారు.

రాష్ట్రవ్యాప్తంగా అటవీ విస్తీర్ణం పెంపు, జీవవైవిధ్య పరిరక్షణ, పర్యావరణ సమతుల్యత సాధనకు ఈ కార్యక్రమం దోహదపడుతుందని అధికారులు ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో అటవీ రేంజ్ అధికారి డి. పోతురాజు, అటవీశాఖ సిబ్బంది పాల్గొన్నారు.