గురు పౌర్ణమి మహోత్సవాలకు శివదత్త సాయి ఆలయం సిద్ధం

గురు పౌర్ణమి పర్వదినం.. భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు

ఎల్కతుర్తి, జూలై 28: హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండల కేంద్రంలోని శివాలయ ప్రాంగణంలో ఉన్న శ్రీ శివదత్త సాయి ఆలయంలో జూలై 29 (బుధవారం) గురు పౌర్ణమి సందర్భంగా ప్రత్యేక పూజా కార్యక్రమాలను ఘనంగా నిర్వహించనున్నట్లు ఆలయ అర్చకులు నందనం రవి తెలిపారు.

ఉదయం 6 గంటలకు కాకడ హారతి, అనంతరం అర్చన, అభిషేకం, ధూప, దీప, నైవేద్య సమర్పణ కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఉదయం 9 గంటలకు ప్రత్యేక పల్లకి సేవ జరగనుండగా, మధ్యాహ్నం 1 గంటకు మహా అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తారు. శ్రీ గురుదత్త స్వామి, శివదత్త సాయిబాబా భక్తుల కోరికలను నెరవేర్చే కరుణామూర్తిగా ప్రసిద్ధి చెందారని, గురు పౌర్ణమి రోజున స్వామివారిని భక్తిశ్రద్ధలతో దర్శించి ప్రత్యేక పూజల్లో పాల్గొంటే ఆధ్యాత్మిక శాంతి, ఐశ్వర్యం, ఆరోగ్యం, సకల శుభాలు కలుగుతాయని అర్చకులు తెలిపారు.

ఈ పవిత్ర సందర్భంగా భక్తులందరూ అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి తీర్థప్రసాదం, అన్నప్రసాదం స్వీకరించి ఆశీర్వాదాలు పొందాలని ఆలయ అర్చకులు నందనం రవి, మణికంఠ, రాహుల్ శర్మ భక్తులకు విజ్ఞప్తి చేశారు.