మహానాడు విజయవంతానికి సమష్టిగా కృషి చేయాలి

మహానాడు విజయవంతానికి సమష్టిగా కృషి చేయాలి
రాప్తాడు, ఆంధ్రప్రభ : ప్రతి ఏటా ఘనంగా నిర్వహించే మహానాడు కార్యక్రమాన్ని టిడిపి నాయకులు, కార్యకర్తలు, పరిటాల కుటుంబ అభిమానులు, ప్రజలు కలిసి విజయవంతం చేయాలని రాప్తాడు అబ్జర్వర్ పద్మలతా రెడ్డి, ఎమ్మెల్యే పరిటాల సునీత పిలుపునిచ్చారు.
సోమవారం టిడిపి క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన పలు కార్యక్రమాలకు ముఖ్యఅతిథిగా పద్మలతా రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పరిటాల సునీతతో కలిసి ఆమె మాట్లాడారు.
ఈసారి మహానాడు మన ప్రాంతంలోనే నిర్వహించే అవకాశం వచ్చిందని, దీనిని విజయవంతం చేయడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సూచించారు. ఈ నెల 27, 28 తేదీల్లో నిర్వహించనున్న మహానాడు కార్యక్రమానికి సంబంధించి నియోజకవర్గ కన్వీనర్లు, క్లస్టర్ ఇన్‌చార్జీలు, ముఖ్య నాయకులతో సమావేశం నిర్వహించినట్లు తెలిపారు.
విశాఖపట్నంలో ప్రారంభించి నెల్లూరులో ఖరారు చేసిన మహానాడు, ఈసారి ప్రధాని మోదీ సూచనల మేరకు వర్చువల్ విధానంలో, పొదుపు చర్యలతో నిర్వహిస్తున్నట్లు వివరించారు. ప్రతి క్లస్టర్ పరిధిలో ఈ కార్యక్రమాన్ని “పసుపు పండుగ”గా జరుపుకోవాలని పార్టీ ఆదేశించిందన్నారు.
గతంలో లేనివిధంగా స్థానికంగానే మహానాడు నిర్వహించుకునే అవకాశం వచ్చిందని, సభ్యత్వం ఉన్న ప్రతి కార్యకర్త పాల్గొనాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో డాక్టర్ కేవీ సుబ్బారెడ్డి, మార్కెట్ యార్డ్ చైర్మన్ సుధాకర్ నాయుడు, మండల కన్వీనర్ పంపు కొండప్ప, టిడిపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
