నాణ్యమైన ఆయిల్ ఫాం మొక్కలు సిద్ధం చేయాలి..

నాణ్యమైన ఆయిల్ ఫాం మొక్కలు సిద్ధం చేయాలి..
- భూముల వివరాలు సమగ్రంగా సిద్ధం చేయాలి..
- ఇంటిగ్రేటెడ్ స్కూల్ పనులు పూర్తి చేయాలి..
- పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష
సుల్తానాబాద్ /ఎలిగేడు, ఆంధ్రప్రభ : ఆయిల్ పామ్ సాగు విస్తరణకు అవసరమైన నాణ్యమైన మొక్కలను సిద్ధం చేసి రైతులకు అందుబాటులో ఉంచాలని జిల్లా కలెక్టర్ కొ య శ్రీహర్ష అధికారులను ఆదేశించారు. సోమవారం సుల్తానాబాద్ మండలంలోని రెబ్బల్ దేవ్పల్లి ఆయిల్ పామ్ ప్రైమరీ, సెకండరీ నర్సరీలను, ఎలిగేడు మండలంలోని ర్యాకల్ దేవ్ పల్లి ప్రభుత్వ భూములను, నిర్మాణానికి సిద్ధంగా ఉన్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ పనులను పరిశీలించారు.
ఈ సందర్భంగా రెబ్బలేవ్పల్లి గ్రామంలో 48 ఎకరాల వి స్తీర్ణంలో ఉన్న ఆయిల్ పామ్ నర్సరీని పరిశీలించిన కలెక్టర్.. రాబోయే ఖరీఫ్ సీజన్కు అవసరమైన మేర రైతులకు నాణ్యమైన మొక్కలను సరఫరా చేయాలని సూచించారు. గత సంవత్సరం 40 వేల మొక్కలను ఇతర జిల్లాలకు సరఫరా చేసినట్లు, వాటిని తిరిగి తీసుకువస్తున్నట్లు అధికారులు వివరించారు. ప్రస్తుతం 20 వేల మొక్కలు అందుబాటులో ఉన్నాయని తెలపగా, 1,000 ఎకరాలకు అవసరమైన మొక్కలను సిద్ధం చేయాలని కలెక్టర్ ఆదేశించారు.
అనంతరం ర్యాకల్ దేవ్పల్లి పరిధిలోని ప్రభుత్వ భూములను పరిశీలించిన కలెక్టర్, మండలంలోని ప్రభుత్వ భూములకు సంబంధించిన సంపూర్ణ వివరాలను సిద్ధం చేసి సమర్పించాలని తహసీల్దార్ను ఆదేశించారు. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణ పనులను పరిశీలించిన కలెక్టర్, ప్రభుత్వం నిర్దేశించిన ప్రమాణాలకు అనుగుణంగా నాణ్యతతో పనులు చేపట్టాలని, నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు. కలెక్టర్ వెంట హార్టికల్చర్ అధికారులు ఎస్. మహేష్, జ్యోతి, తిరుమల ఆయిల్ పామ్ ప్రైవేట్ లిమిటెడ్ సీఈఓ కేశ్ కళ్యాణ్కర్, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.
