ప్రతి సమస్యకు పరిష్కారం..

  • ప్రజల సమస్యల పరిష్కారమే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యం
  • అర్జీ ఇచ్చిన ప్రతి ఒక్కరికీ త్వరితగతిన న్యాయం జరుగుతోంది..
  • ప్రతి శుక్రవారం ప్రజా దర్బార్‌తో సమస్యలకు వేగవంతమైన పరిష్కారం
  • ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ప్రజాప్రతినిధులు
  • విజయవాడ ఎంపీ కేసినేని శివనాద్ ఎమ్మెల్యే బోండా ఉమ
  • ప్రజా దర్బార్ లో స్వయంగా ఫిర్యాదుల స్వీకరణ

పాయికాపురం, ఆంధ్రప్రభ : ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని వేగంగా పరిష్కరించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని విజయవాడ పార్లమెంట్ సభ్యుడు కేశినేని శివనాథ్ (చిన్ని) అన్నారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలోని సింగ్‌నగర్‌లో ఎమ్మెల్యే కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన ప్రజా దర్బార్ (పీజీఆర్‌ఎస్) కార్యక్రమంలో ప్రభుత్వ విప్, సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావుతో కలిసి ప్రజల నుంచి వినతిపత్రాలను స్వీకరించి సంబంధిత అధికారులకు వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ సందర్భంగా ఎంపీ కేశినేని చిన్ని మాట్లాడుతూ, విజయవాడ నగరంలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను వేగవంతంగా అమలు చేస్తూ ప్రజలకు చేరువ చేస్తున్న ఘనత కూటమి ప్రభుత్వానిదేనని అన్నారు.

ప్రజా దర్బార్‌లో అర్జీ ఇచ్చిన ప్రతి ఒక్కరి సమస్యను కొద్ది రోజుల్లోనే పరిష్కరించే విధంగా ప్రభుత్వం పనిచేస్తోందని తెలిపారు. అందువల్లే ఈ కార్యక్రమానికి ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోందని పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రతి నెల ఒకటో తేదీ ఉదయం నుంచే ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు లబ్ధిదారులకు అందేలా ప్రభుత్వం సమర్థవంతంగా వ్యవహరిస్తోందని చెప్పారు. విజయవాడలో అత్యంత బలమైన పార్టీ క్యాడర్ సెంట్రల్ నియోజకవర్గంలో ఉందని, కార్యకర్తలను కుటుంబ సభ్యుల్లా ఆదరిస్తూ వారికి అన్నలా అండగా నిలుస్తున్న నాయకుడు ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు అని కొనియాడారు. ప్రతి శుక్రవారం నిర్వహిస్తున్న ప్రజా దర్బార్‌పై ప్రజల్లో విశ్వాసం పెరిగిందని, కార్యాలయానికి వచ్చి వినతిపత్రం సమర్పిస్తే తమ సమస్యకు తప్పకుండా పరిష్కారం లభిస్తుందనే నమ్మకం ఏర్పడిందన్నారు. ప్రజలకు సేవ చేయడమే ప్రజాప్రతినిధుల ప్రధాన బాధ్యత అని, అదే లక్ష్యంతో ఎంపీ, ఎమ్మెల్యేలు ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నట్లు తెలిపారు.