త్రివేణి సంగమంలో పుష్కర స్థానం..

త్రివేణి సంగమంలో పుష్కర స్థానం..

  • కాళేశ్వరంలో ఆధ్యాత్మిక సందడి

మహాదేవపూర్, ఆంధ్రప్రభ : జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండలం కాళేశ్వరంలో జరుగుతున్న సరస్వతి అంత్య పుష్కరాలు భక్తిజన సందోహంతో ఆధ్యాత్మిక వాతావరణంలో కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా శ్రీ అద్వైతానంద భారతి శ్రీ శ్రీ అవని శృంగేరి జగద్గురువులు, శంకరాచార్య మహాసంస్థానం స్వామీజీలు శనివారం కాళేశ్వరం చేరుకుని పవిత్ర త్రివేణి సంగమంలో పుష్కర స్థానం ఆచరించి విశేష పూజలు నిర్వహించారు.

గోదావరి, ప్రాణహిత, సరస్వతి నదుల కలయికైన పవిత్ర సంగమంలో వేద మంత్రోచ్చారణల మధ్య సరస్వతి నదిలో పుష్కర స్నానాలు ఆచరించిన స్వామీజీలు నదీమాతకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. దేశ ప్రజలు సుఖశాంతులతో ఉండాలని, లోకక్షేమం కలగాలని ప్రార్థనలు చేశారు.

అనంతరం కాళేశ్వర ముక్తీశ్వర స్వామి ఆలయానికి చేరుకోగా ఆలయ అధికారులు, వేద పండితులు, అర్చకులు పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు. ఆలయంలో శ్రీ కాళేశ్వర ముక్తీశ్వర స్వామివారికి పంచామృతాలతో ప్రత్యేక అభిషేకాలు, అర్చనలు నిర్వహించారు. అలాగే శ్రీ శుభానంద పార్వతి అమ్మవారికి, మహా సరస్వతి అమ్మవారికి విశేష హారతులు సమర్పించారు. ఆలయ ప్రాంగణం భక్తుల శివనామస్మరణలతో మారుమోగింది.

తదనంతరం ఆశీర్వచన మండపంలో ఆలయ తరఫున స్వామీజీలకు పండ్లు, శేష వస్త్రాలు సమర్పించి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు సరస్వతి మాత విగ్రహాన్ని అందజేశారు. అనంతరం భక్తులకు ఆశీర్వచనాలు అందించిన స్వామీజీలు సనాతన ధర్మ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు. భక్తి, సేవా భావాలతో జీవనం సాగించాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో అడిషనల్ కమిషనర్ ఎం. కృష్ణవేణి, ఆర్జేసీ రామకృష్ణారావు, దేవదాయ శాఖ సలహాదారు గోవింద హరి, ఈఓ మహేష్, చైర్మన్ మోహన్ శర్మ, ధర్మకర్తలు, ఆలయ సిబ్బంది, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.