ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో సమస్యలు పరిష్కరించాలి
ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో సమస్యలు పరిష్కరించాలి
- జొన్నలు కొనుగోలు కేంద్రాలు వెంటనే ఏర్పాటు చేయాలి
- సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు చుక్క రాములు
- కలెక్టరు కార్యాలయం ఎదుట సీపీఎం ధర్నా
సంగారెడ్డి ప్రతినిధి, ఆంధ్రప్రభ : జిల్లా వ్యాప్తంగా ధాన్యం కొనుగోలు కేంద్రాలలోని, జొన్నల కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు చుక్క రాములు అన్నారు. సోమవారం సంగారెడ్డిలో కలెక్టర్ కార్యాలయం ఎదుట సీపీఎం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. అనంతరం సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని జిల్లా కలెక్టర్‌కు అందజేశారు. ఈ సందర్భంగా చుక్క రాములు మాట్లాడుతూ రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు కల్పించాలన్నారు.
ఆరుగాలం కష్టపడి పండించిన పంటలను మధ్యలో దళారులు చేరి మిల్లర్లకు, వ్యాపారులకు అమ్ముకునే దుస్థితి తెస్తున్నారని అన్నారు. కొనుగోలు కేంద్రాల్లో వాహనాలు సరిపడా లేవన్నారు. రైతులు అమ్ముకున్న పంటకు ఎదురు చూడకుండా వెంటనే చెల్లింపులు జరిగేలా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు. ధాన్యాన్ని కొనుగోలు చేయడం ద్వారా వర్షాలు పడి రైతులు రాత్రింబవాళ్లు పడిగాపులు కాయాల్సిన పరిస్థితి దాపురించిందని తెలిపారు. ధాన్యం తడవకుండా తాటిపత్రి సౌకర్యాన్ని రైతులకు అందజేయాలన్నారు.
తరుగు పేరుతో క్వింటల్ కు 6 నుంచి 7 కిలోలు తీస్తూ రైతులను దోచుకోవడం జరుగుతుందన్నారు. ధాన్యం కొనుగోళ్లు కేంద్రాలకు వెంటనే సరిపడా సంచులు వేంటనే సరఫరా చేయాలని, హమాలీల సమస్యలు పరిస్కారం చేయాలని అన్నారు. రైతు ప్రభుత్వం అని చెప్పుకుంటున్న కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల ఇబ్బందులు ఎందుకు పట్టించుకోవడంలేదని విమర్శించారు. కొనుగోలు కేంద్రాల్లో మంచినీళ్లు, కనీస సౌకర్యాలు కల్పించాలని ప్రభుత్వం ను డిమాండ్ చేశారు.
సీపీఎం జిల్లా కార్యదర్శి గొల్లపల్లి జయరాజు మాట్లాడుతూ ఈ ఏడాది జిల్లా వ్యాప్తంగా 90 వేల ఎకరాల్లో జొన్న సాగైందని, రైతుల వద్ద జొన్నలు అమ్ముడు పోక, కొనుగోలు కేంద్రాలు తెరవక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు.వెంటనే జొన్నల కొనుగోలు కేంద్రాలు వెంటనే ఏర్పాటు చేయాలనీ అన్నారు. లేకుంటే ఆందోళన చేస్తామని ప్రభుత్వం ను హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బి.మల్లేశం, ఎ.మాణిక్, జి.సాయిలు, జిల్లా కమిటీ సభ్యులు కృష్ణ, నాయకులు అశోక్, రాజయ్య, రమేష్ గౌడ్, మంజుల, మహేష్, భూషణం, నర్సింలు, వెంకటేశం, ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.
