సభ్యత్వ నమోదుకు బీఆర్ఎస్ కార్యాచరణ

సభ్యత్వ నమోదుకు బీఆర్ఎస్ కార్యాచరణ
- నియోజకవర్గాల వారీగా ఇన్‌చార్జిల నియామకం
- పార్టీ బలోపేతమే లక్ష్యంగా బీఆర్ఎస్
ఉమ్మడి మెదక్ ప్రతినిధి, ఆంధ్రప్రభ: పార్టీని గ్రామస్థాయి నుంచి మరింత బలోపేతం చేయడం, కార్యకర్తల భాగస్వామ్యాన్ని పెంపొందించడం లక్ష్యంగా బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమానికి ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేసింది. ఈ మేరకు ఉమ్మడి మెదక్ జిల్లాలోని పలు నియోజకవర్గాలకు సభ్యత్వ నమోదు ఇన్‌చార్జిలను పార్టీ నాయకత్వం నియమించింది.
సిద్దిపేటకు ఎమ్మెల్సీ డాక్టర్ వంటేరు యాదవరెడ్డి, మెదక్‌కు మాజీ ఎమ్మెల్సీ ఫారూక్ హుస్సేన్, పటాన్‌చెరుకు ఎర్రోళ్ల శ్రీనివాస్, జహీరాబాద్ (ఎస్సీ)కు దేవీ ప్రసాద్, దుబ్బాకకు కాసాల బుచ్చిరెడ్డి, నారాయణఖేడ్‌కు జైపాల్ రెడ్డి, అందోల్ (ఎస్సీ)కు పట్నం మాణిక్యం, నర్సాపూర్‌కు నరహరి రెడ్డి, సంగారెడ్డికి చంద్రగౌడ్, గజ్వేల్‌కు రాధాకృష్ణ శర్మలను సభ్యత్వ నమోదు ఇన్‌చార్జిలుగా నియమించారు.
ఈ సందర్భంగా పార్టీ వర్గాలు తెలిపిన వివరాల ప్రకారం, ప్రతి గ్రామం, వార్డు స్థాయిలో సభ్యత్వ నమోదు శిబిరాలు నిర్వహించేందుకు కార్యాచరణ రూపొందించబడిందని పేర్కొన్నారు. పార్టీ సిద్ధాంతాలు, గత ప్రభుత్వ హయాంలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరిస్తూ యువత, మహిళలు, రైతులు, కార్మికులను పెద్ద ఎత్తున సభ్యత్వ కార్యక్రమంలో భాగస్వాములను చేయనున్నట్లు తెలిపారు. అలాగే డిజిటల్ విధానంలో సభ్యత్వ నమోదు చేపట్టి పార్టీ నిర్మాణాన్ని మరింత పటిష్టం చేయాలని నిర్ణయించినట్లు వెల్లడించారు. ప్రతి నియోజకవర్గంలో ప్రత్యేక సమీక్షా సమావేశాలు నిర్వహిస్తూ సభ్యత్వ నమోదు పురోగతిని పర్యవేక్షించనున్నట్లు పార్టీ నాయకులు తెలిపారు.
రాబోయే రోజుల్లో ప్రజా సమస్యలపై ఉద్యమ కార్యాచరణను మరింత విస్తృతం చేస్తూ బీఆర్ఎస్‌ను ప్రజలకు మరింత చేరువ చేయడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశ్యమని పార్టీ శ్రేణులు పేర్కొన్నాయి.
