ప్రొఫెసర్ జయశంకర్ జీవితం ప్రతి ఒక్కరికీ ఆదర్శనీయం
జయశంకర్ జయంతి సందర్భంగా ఘన నివాళులర్పించిన అధికారులు
ఊట్కూర్, ఆంధ్రప్రభ: తెలంగాణ సిద్ధాంతకర్త, ఉద్యమకారుడు ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ జీవితం ప్రతి ఒక్కరికీ ఆదర్శనీయమని ఊట్కూర్ తహసీల్దార్ అశోక్ కుమార్, ఎంపీడీవో పావని అన్నారు.
గురువారం నారాయణపేట జిల్లా ఊట్కూర్ తహసీల్దార్ కార్యాలయం, ఎంపీడీవో కార్యాలయాల్లో ప్రొఫెసర్ జయశంకర్ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రొఫెసర్ జయశంకర్ తన జీవితాన్ని అంకితం చేశారని అన్నారు. ప్రత్యేక తెలంగాణ ఆవశ్యకతను దేశవ్యాప్తంగా ప్రజలకు చాటిచెప్పి ఉద్యమానికి సిద్ధాంతపరమైన బలాన్ని అందించారని పేర్కొన్నారు.
యువత ఆయన ఆశయాలను ఆదర్శంగా తీసుకుని సమాజాభివృద్ధికి కృషి చేయాలని సూచించారు. ప్రొఫెసర్ జయశంకర్ నిరాడంబర జీవితం, ప్రజల పట్ల అంకితభావం ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకమని కొనియాడారు. ఆయన చూపిన మార్గంలో నడుస్తూ ప్రజాసేవను లక్ష్యంగా చేసుకుని పనిచేయాలని, తెలంగాణ అభివృద్ధి, సంక్షేమం కోసం ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతను నిర్వర్తించాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దార్ చింతా రవి, ఎడవల్లి సర్పంచ్ అంజయ్య, పెద్ద జట్రం కాంగ్రెస్ నాయకుడు రమేష్, రెవెన్యూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
