రోడ్డు ప్రమాదాల నివారణలో ఆటో డ్రైవర్ల పాత్ర కీలకం
నందిగామ, ఆంధ్రప్రభ: రోడ్డు ప్రమాదాల నివారణలో ప్రతి ఆటో డ్రైవర్ బాధ్యతాయుతంగా వ్యవహరించి భాగస్వామి కావాలని ట్రాఫిక్ పోలీసులు సూచించారు. పోలీస్ కమిషనర్ రాజశేఖర్‌బాబు, ట్రాఫిక్ డీసీపీ షరీన్ బేగం ఆదేశాల మేరకు ఇబ్రహీంపట్నం ట్రాఫిక్ ఆర్‌ఐ కృష్ణ, నందిగామ ట్రాఫిక్ ఎస్‌ఐ నరేష్ ఆధ్వర్యంలో నందిగామ పట్టణం, గ్రామీణ ప్రాంతాలకు చెందిన ఆటో డ్రైవర్లకు రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ట్రాఫిక్ నిబంధనలకు సంబంధించిన కరపత్రాలను పంపిణీ చేసి, ప్రమాదాల నివారణకు తమ వంతు బాధ్యత నిర్వర్తిస్తామని ఆటో డ్రైవర్లతో ప్రతిజ్ఞ చేయించారు.
అతివేగం, నిర్లక్ష్యపు డ్రైవింగ్, ఓవర్‌లోడింగ్, అధిక చార్జీలు వసూలు చేయడం, మద్యం సేవించి వాహనం నడపడం, డ్రైవింగ్ సమయంలో మొబైల్ ఫోన్ వినియోగించడం వంటి నిబంధనల ఉల్లంఘనలకు పాల్పడవద్దని అధికారులు సూచించారు. ప్రయాణికుల భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇస్తూ మర్యాదపూర్వకంగా వ్యవహరించాలని, ట్రాఫిక్ నిబంధనలు పాటించడం ద్వారా ప్రమాదాలను గణనీయంగా తగ్గించవచ్చని తెలిపారు. నిబంధనలు ఉల్లంఘించే వారిపై మోటారు వాహనాల చట్టం ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
