రైతులకు ఇబ్బందులు లేకుండా చర్యలు

రైతులకు ఇబ్బందులు లేకుండా చర్యలు
జిల్లా కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్
నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి, ఆంధ్రప్రభ : రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు, తీసుకుంటామని రైతులు దళారులను నమ్మి మోసపోవద్దని మీడియా సమావేశంలో జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ వెల్లడించారు. మంగళవారం రాత్రి కలెక్టరేట్లో మీడియా హాల్లో నిర్వహించిన మీడియా సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు నాగర్ కర్నూల్ జిల్లాలో రైతుల నుంచి మొక్కజొన్న, వరి కొనుగోళ్లు పారదర్శకంగా మరియు వేగవంతంగా కొనసాగుతున్నాయని హేమంత్ కేశవ్ పాటిల్ తెలిపారు. నాగర్ కర్నూలు జిల్లాలో మొక్కజొన్న ఇప్పటివరకు 60 శాతం కొనుగోలు ప్రక్రియ పూర్తి అయిందని, రానున్న పది రోజుల్లో 90% మొక్కజొన్న కొనుగోలు ప్రక్రియను పూర్తి చేయనున్నట్లు కలెక్టర్ వెల్లడించారు.
ప్రభుత్వం రైతుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని కనీస మద్దతు ధరలతో పంట కొనుగోలు కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలు చేస్తోందన్నారు. రైతులు ఎటువంటి మధ్యవర్తులపై ఆధారపడకుండా నేరుగా ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలకు తమ పంటలను తీసుకురావాలని జిల్లా వ్యాప్తంగా ఏర్పాటు చేసిన 15 ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు కలెక్టర్ తెలిపారు. జిల్లాలో ఇప్పటివరకు గోదాంల నిల్వ మరియు హమాలీల సమస్య కారణంగా కొంత ఇబ్బందులు గురి కావడం జరిగిందని, జిల్లా యంత్రాంగం రైతులను దృష్టిలో ఉంచుకొని సమస్యలను అధిగమించేలా రవాణా జిన్నింగ్ మిల్లుల నిల్వలు ఉంచడం ఎందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని అందుకు అనుగుణంగా జిల్లా యంత్రాంగం ఏర్పాటు చేసిందని రానున్న వారం రోజుల్లో సమస్యను అధిగమించి కొనుగోలు ప్రక్రియను పూర్తి చేయనున్నట్లు కలెక్టర్ వెల్లడించారు.

హమాలీల సమస్యను అధిగమించేలా స్థానికంగానే ఉండే హమాలీలతో సమస్యలను పరిష్కరించేలా అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేయడం జరిగిందని తెలిపారు.
జిల్లాలోని రైతులు ధాన్యాన్ని ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలకు తీసుకువెళ్లే ముందు తేమ శాతం నిర్దేశిత ప్రమాణాలకు అనుగుణంగా ఉండేలా చూసుకోవాలని కలెక్టర్ విజ్ఞప్తి చేశారు. ధాన్యంలో అధిక తేమ ఉండడం వల్ల కొనుగోలు ప్రక్రియ ఆలస్యం కావడంతో పాటు రైతులకు ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందన్నారు.
అందువల్ల రైతులకు మీడియా ద్వారా విస్తృతంగా అవగాహన కల్పించి, అవసరమైన తేమ శాతంతో ఉన్న ధాన్యాన్ని మాత్రమే కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలని సూచించారు. దీంతో ధాన్యం పూర్తిస్థాయిలో, వేగంగా కొనుగోలు చేయడం సాధ్యమవుతుందని తెలిపారు. రైతులకు చెల్లింపుల విషయంలో ఎలాంటి ఆలస్యం జరగకుండా చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ స్పష్టం చేశారు. ధాన్యం కొనుగోలు అనంతరం సంబంధిత వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేసి, నేరుగా రైతుల బ్యాంకు ఖాతాల్లోనే నగదు జమ చేసే విధానాన్ని అమలు చేస్తున్నామని పేర్కొన్నారు. ఎవరైనా రైతుల నుంచి అక్రమంగా డబ్బులు వసూలు చేయడానికి ప్రయత్నించినా లేదా కొనుగోలు ప్రక్రియలో అవకతవకలు జరిగినా వెంటనే అధికారులకు సమాచారం ఇవ్వాలని సూచించారు.
ఇటువంటి ఘటనలపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జిల్లాలో ఉన్న జిన్నింగ్ మిల్లులను రైతుల నుండి కొనుగోలు చేసిన మొక్కజొన్న నిలువ ఉంచేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని కలెక్టర్ తెలిపారు. జిల్లాలో ఇప్పటివరకు 1.5 లక్షల మెట్రిక్ టన్నుల మొక్కజొన్న కొనుగోలు చేయడం జరిగిందన్నారు, కొనుగోలు ప్రక్రియను పర్యవేక్షించేందుకు ప్రత్యేక బృందాలను నియమించామని, ప్రతి రోజు కొనుగోలు కేంద్రాల పనితీరును సమీక్షిస్తున్నామని కలెక్టర్ తెలిపారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా రెవెన్యూ, వ్యవసాయ, మార్కెటింగ్, పౌర సరఫరాల శాఖల అధికారులు సమన్వయంతో పనిచేస్తున్నారని చెప్పారు.
జిల్లాలో అకాల వర్షాలు సంభవిస్తానని అందుకు ముందస్తుగా రైతులకు చేరే విధంగా చర్యలు తీసుకుంటామని, ఈ విషయంలో మీడియా సహకారం అవసరమని కలెక్టర్ కోరారు. ప్రభుత్వం రైతుల సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని, రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కలెక్టర్ పేర్కొన్నారు. జిల్లాలో ధాన్యం కొనుగోలు ప్రక్రియ పూర్తయ్యే వరకు అధికారులు అప్రమత్తంగా పనిచేస్తారని తెలిపారు.
