విద్యారంగ సమస్యలను పరిష్కరించాలి
యూఎస్పీసీ ఆధ్వర్యంలో తహసీల్దార్‌కు వినతిపత్రం
వాజేడు, ఆంధ్రప్రభ: విద్యారంగంలో నెలకొన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని యూఎస్పీసీ ఆధ్వర్యంలో వాజేడు మండల తహసీల్దార్ శ్రీనివాస్‌కు బుధవారం వినతిపత్రం సమర్పించారు.
విద్యారంగంలో దశాబ్దాలుగా పేరుకుపోయిన సమస్యలకు పరిష్కారం చూపాలని వారు కోరారు. పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని, పెండింగ్‌లో ఉన్న ఆరు కరువు భత్యాలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
వేతన సవరణ సంఘం నివేదికను పరిశీలించి 2023 సంవత్సరం నుంచి వేతన సవరణ సంఘాన్ని అమలు చేయాలని కోరారు. సమగ్ర శిక్ష ఉద్యోగులను క్రమబద్ధీకరించాలని, ఉద్యోగుల ఆరోగ్య పథకాన్ని వెంటనే అమల్లోకి తీసుకురావాలని విజ్ఞప్తి చేశారు.
విద్యారంగానికి సంబంధించిన ఇతర సమస్యలను కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించాలని కోరుతూ తహసీల్దార్‌కు వినతిపత్రం అందజేశారు.
ఈ కార్యక్రమంలో టీఎస్‌యూటీఎఫ్ జిల్లా అధ్యక్షులు పోడం సమ్మయ్య, ఏటీఎఫ్ జిల్లా అధ్యక్షులు జానకీరావు, జయేందర్, టీఎస్‌యూటీఎఫ్ మండల ప్రధాన కార్యదర్శి సింగర్ రాజేష్, ఉపాధ్యక్షులు కుమార్ బాబు, శిరీష, పీఆర్టీయూ టీఎస్ మండల అధ్యక్షులు స్వరూప్ సింగ్, ఉపాధ్యాయులు ప్రభాకర్, ఆనంద్ తదితరులు పాల్గొన్నారు.
