గజ్జన్న మృతి… ప్రజా ఉద్యమాలకు తీరని లోటు

దస్తూరాబాద్, ఆంధ్రప్రభ: నిర్మల్ జిల్లా దస్తూరాబాద్ మండలం దేవునిగూడెం గ్రామానికి చెందిన సీపీఐ (ఎంఎల్) న్యూ డెమోక్రసీ పార్టీ సీనియర్ నాయకుడు కామ్రేడ్ గుజ్జుల గజ్జన్న అనారోగ్యంతో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఆయన భౌతికకాయంపై పార్టీ నాయకులు ఎర్రజెండా కప్పి నివాళులర్పించారు.

దేవునిగూడెంలో నిర్వహించిన అంత్యక్రియల్లో సీపీఐ (ఎంఎల్) న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి జే. రాజు, ఖానాపూర్ డివిజన్ కార్యదర్శి సునారికారి రాజేష్, ఏఐకేఎంఎస్ జిల్లా అధ్యక్షుడు కె. సర్దార్, కార్యదర్శి ఉపాలి పాల్గొన్నారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గజ్జన్న మరణం పార్టీకి, ప్రజా ఉద్యమాలకు తీరని లోటని అన్నారు. పేదల కోసం భూమి, భుక్తి, విముక్తి కోసం ఆయన తన ప్రాణాలను సైతం లెక్కచేయకుండా పోరాడారని పేర్కొన్నారు. దోపిడీ వ్యవస్థకు, భూస్వాములకు వ్యతిరేకంగా లాఠీలు, తూటాలకు భయపడకుండా ముందుండి పోరాడిన కామ్రేడ్ గజ్జన్నకు విప్లవ జోహార్లు అర్పిస్తున్నట్లు తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఐఎఫ్‌టీయూ జిల్లా ఉపాధ్యక్షుడు దుర్గం లింగన్న, డివిజన్ నాయకులు ఆడెపు గణేష్, మద్దినేని చిన్న రాజన్న తదితరులు పాల్గొన్నారు.