చేయూత పింఛన్లను అర్హులకు పారదర్శకంగా అందిద్దాం

అర్హులైన ప్రతి లబ్ధిదారుడికి ప్రభుత్వ పథకం ప్రయోజనం

ఊట్కూర్, ఆంధ్రప్రభ : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న చేయూత పింఛన్లను అర్హులైన ప్రతి ఒక్కరికీ పారదర్శకంగా అందించేందుకు అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేయాలని ఊట్కూర్ ఎంపీడీవో పావని అన్నారు.

బుధవారం నారాయణపేట జిల్లా ఊట్కూర్ గ్రామపంచాయతీ కార్యాలయంలో కొనసాగుతున్న చేయూత పింఛన్ల దరఖాస్తుల స్వీకరణ, పరిశీలన ప్రక్రియను ఆమె పరిశీలించారు.

ఈ సందర్భంగా ఎంపీడీవో పావని మాట్లాడుతూ.. పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకునే అర్హుల నుంచి అవసరమైన వివరాలు, ధ్రువపత్రాలను సక్రమంగా స్వీకరించి, నిబంధనల ప్రకారం పరిశీలించాలని సిబ్బందికి సూచించారు.

అర్హత ఉన్న ప్రతి లబ్ధిదారుడికి ప్రభుత్వ పథకం ప్రయోజనం అందేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. అనర్హులకు పింఛన్లు మంజూరు కాకుండా, అర్హులైన వారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు.

ప్రజలు పింఛన్ల దరఖాస్తుల విషయంలో ఎలాంటి అపోహలకు గురికావద్దని, ప్రభుత్వం సూచించిన విధంగా అవసరమైన పత్రాలతో దరఖాస్తు చేసుకోవాలని ఆమె సూచించారు.

దరఖాస్తుల పరిశీలనలో ఎలాంటి అవకతవకలకు తావులేకుండా అధికారులు ప్రత్యేక దృష్టి సారిస్తున్నారని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో ఎంపీవో బాలాజీ, సర్పంచ్ రేణుక భరత్, ఉప సర్పంచ్ రమేష్, పంచాయతీ కార్యదర్శి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.