Chittoor | నగరి నీటి కలకు కొత్త ఊపిరి..!

2028 నాటికి నగరికి తాగునీరు అందించడమే లక్ష్యంగా పనులు
పెండింగ్ పనులకు కూటమి సర్కార్ నిధుల ఊతం
గాలేరు నగరి సుజల స్రవంతిపై చంద్రబాబు ప్రత్యేక దృష్టి
ఆల్తూరుపాడు 84.95 శాతం పూర్తి.. మెర్లపాక 41.44 శాతమే..
ప్రాజెక్టుకు నిధుల వరద, అయినా ఇంకా రూ.465.63 కోట్లు అవసరం


Chittoor | (చిత్తూరు బ్యూరో, ఆంధ్రప్రభ) : ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్న నగరి నియోజకవర్గ జలవనరుల అనుసంధాన పథకానికి కూటమి ప్రభుత్వం మళ్లీ కదలిక తీసుకొచ్చింది. ముఖ్యమంత్రి చంద్రబాబు ఇచ్చిన హామీ మేరకు 2028 నాటికి నగరి నియోజకవర్గానికి నీటిని అందించడమే లక్ష్యంగా సాగునీటి శాఖ పనులను ముందుకు తీసుకెళ్తోంది. సోమశిల, కండలేరు, ఆల్తూరుపాడు జలాశయాల నుంచి నీటిని తరలించి ఎస్ఎస్ఎల్ కాలువ ద్వారా గాలేరు నగరి సుజల స్రవంతి కాలువకు అనుసంధానం చేయడంతోపాటు మల్లెమడుగు, శ్రీ బాలాజీ, వెంకటగోపాలసాగర్, వేపగుంట, అడవికొత్తూరు జలాశయాలకు సంబంధించిన పనులను కూడా చేపట్టాల్సి ఉంది. అధికారిక నివేదికలో ఈ పనులన్నింటినీ 2028 లక్ష్యంతో అనుసంధానించినట్లు పేర్కొన్నారు. ఈ జలవనరుల అనుసంధానానికి మూలమైన సోమశిల–స్వర్ణముఖి అనుసంధాన కాలువకు గతంలోనే పరిపాలనా అనుమతులు లభించాయి. అయితే కాలక్రమంలో అటవీ భూములు, కాలువ మార్గం, నిధుల కొరత తదితర కారణాలతో పనులు ఆశించిన స్థాయిలో ముందుకు సాగలేదు. దీంతో నగరి ప్రాంతానికి నీటిని అందించాలన్న లక్ష్యాన్ని నెరవేర్చేందుకు ప్రత్యామ్నాయ అనుసంధాన మార్గాలు, ఎత్తిపోతల పథకాలు, జలాశయాల నిర్మాణాలకు ప్రాధాన్యం ఏర్పడింది.

ప్రస్తుతం గాలేరు నగరి సుజల స్రవంతి రెండో దశ పనుల్లో భాగంగా ఎస్ఎస్జీని ఎస్ఎస్ఎల్‌సీ ద్వారా గాలేరు నగరి సుజల స్రవంతి కాలువతో అనుసంధానించే పనులు వివిధ దశల్లో కొనసాగుతున్నాయి. ఇందులో కీలకమైన ఆల్తూరుపాడు ఎత్తిపోతల పథకం పనులు 84.95 శాతం పూర్తయ్యాయి. ఎస్ఎస్ఎల్ కాలువ పనులు 51.42 శాతం పూర్తయ్యాయి. మెర్లపాక ఎత్తిపోతల పథకం పనులు మాత్రం 41.44 శాతం వద్ద ఉన్నాయి. ఆల్తూరుపాడు ఎత్తిపోతల పథకం పనులు దాదాపు తుది దశకు చేరుకోవడం ఈ ప్రాజెక్టుకు కొంత ఊరటనిచ్చే అంశంగా మారింది. అయితే ఎస్ఎస్ఎల్ కాలువ, మెర్లపాక ఎత్తిపోతల పథకాల్లో ఇంకా సగానికి పైగా పనులు మిగిలి ఉండటంతో మొత్తం అనుసంధాన వ్యవస్థను పూర్తి చేయడం ప్రభుత్వానికి సవాలుగా మారింది. ఈ మూడు పనులను పూర్తిచేయడానికి ఇంకా రూ.465.626 కోట్లు అవసరమని అధికారుల నివేదిక స్పష్టం చేస్తోంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పెండింగ్ సాగునీటి ప్రాజెక్టుల పూర్తికి ప్రాధాన్యం ఇస్తున్న నేపథ్యంలో నగరి జలవనరుల అనుసంధాన పథకంపైనా ప్రత్యేక దృష్టి పెట్టింది. 19-05-2026న జారీ చేసిన ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు ఐహెచ్‌డీపీ కింద ఆల్తూరుపాడు ఎత్తిపోతల పథకం, ఎస్ఎస్ఎల్ కాలువ, మెర్లపాక ఎత్తిపోతల పథకాలను పూర్తి చేసేందుకు రూ.268 కోట్లు దశలవారీగా సమకూర్చేందుకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది.

ఈ మొత్తాన్ని రూ.19 కోట్లు, రూ.18 కోట్లు, రూ.231 కోట్లుగా విభజించి చూపించారు. అధికారిక నివేదికలో మూడేళ్లలో దశలవారీగా నిధులు సమకూర్చేందుకు ప్రభుత్వం ఆమోదం తెలిపినట్లు పేర్కొన్నారు. ఆల్తూరుపాడు జలాశయానికి భారీ కేటాయింపు ఈ ప్రాజెక్టులో మరో కీలక పరిణామం. ఆల్తూరుపాడు జలాశయ పనులకు పరిపాలనా అనుమతి లభించడంతో పాటు రూ.679.20 కోట్లకు సాంకేతిక అనుమతి కూడా మంజూరైంది. టెండర్లు పిలవాల్సి ఉంది. ఇదే సమయంలో ఆల్తూరుపాడు జలాశయం పూర్తి చేసేందుకు ఐహెచ్‌డీపీ కింద రూ.723 కోట్లను దశలవారీగా సమకూర్చేందుకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. మల్లెమడుగు, శ్రీ బాలాజీ జలాశయాలపైనా ప్రభుత్వం దృష్టి సారించింది. ఈ రెండు జలాశయాలను పూర్తి చేసేందుకు రూ.821 కోట్లు దశలవారీగా సమకూర్చేందుకు ఆమోదం లభించింది. ఇందులో మల్లెమడుగు జలాశయానికి రూ.297 కోట్లు, శ్రీ బాలాజీ జలాశయానికి రూ.524 కోట్లు కేటాయించనున్నారు. ఈ పనులను కూడా ఐహెచ్‌డీపీ కింద మూడేళ్లలో పూర్తి చేయాలన్న లక్ష్యంతో నిధుల సమీకరణకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇక వెంకటగోపాలసాగర్ నిర్మాణానికి సంబంధించిన పనులకు రూ.806 కోట్ల అంచనా సిద్ధం చేసి సంబంధిత ఉన్నతాధికారుల అనుమతి కోసం పంపించారు.

కైలాసగిరి కాలువ పైపులైన్ పనులు, నీటిని ఎత్తిపోసే ఏర్పాట్లు, గాలేరు నగరి సుజల స్రవంతి ప్రధాన కాలువ పనులకు సంబంధించిన అంచనాలు కూడా సిద్ధం చేస్తున్నారు. వేపగుంట, అడవికొత్తూరు జలాశయాల పనులకు రూ.135.32 కోట్ల అంచనాలు సిద్ధం చేసి ప్రభుత్వ ఆమోదానికి పంపించారు. 2028 నాటికి నీరు సాధ్యమేనా? అన్నదే ఇప్పుడు ప్రధాన ప్రశ్న. ముఖ్యమంత్రి హామీ మేరకు 2028ను గడువుగా నిర్ణయించినప్పటికీ ప్రస్తుతం పనుల పురోగతి చూస్తే లక్ష్యం సులభమైనది కాదని స్పష్టమవుతోంది. ఆల్తూరుపాడు ఎత్తిపోతల పథకం 84.95 శాతం పూర్తయినా, ఎస్ఎస్ఎల్ కాలువ 51.42 శాతం, మెర్లపాక ఎత్తిపోతల పథకం 41.44 శాతం వద్ద ఉన్నాయి. మరోవైపు మల్లెమడుగు, శ్రీ బాలాజీ, వెంకటగోపాలసాగర్, వేపగుంట, అడవికొత్తూరు వంటి జలాశయాలు, కాలువలు, ఎత్తిపోతల వ్యవస్థలకు సంబంధించిన పనులు ఇంకా పూర్తి కావాల్సి ఉంది. అయితే ప్రభుత్వం ఇప్పటికే కీలక పనులకు నిధుల సమీకరణకు ఆమోదం ఇవ్వడం, ఆల్తూరుపాడు జలాశయానికి సాంకేతిక అనుమతి మంజూరు చేయడం, మల్లెమడుగు శ్రీ బాలాజీ జలాశయాలకు రూ.821 కోట్ల దశలవారీ నిధులను ఆమోదించడం వంటి చర్యలు తీసుకోవడం ఆశాజనక పరిణామాలుగా కనిపిస్తున్నాయి.

ముఖ్యమంత్రి హామీ నేపథ్యంలో ప్రాజెక్టుపై ప్రభుత్వ స్థాయిలో ఆసక్తి పెరగడంతో పాటు పెండింగ్ పనులను వేగంగా పూర్తి చేయాల్సిన ఒత్తిడి కూడా అధికార యంత్రాంగంపై పెరిగింది. అయితే ఇకపై అసలు పరీక్ష నిధుల ఆమోదం కాదు.. నిధుల సకాల విడుదల, టెండర్ల ఖరారు, భూసేకరణ, అనుమతుల పూర్తి, క్షేత్రస్థాయిలో పనుల వేగం. ప్రధాన కాలువలు, ఎత్తిపోతల పథకాలు, జలాశయాలు పరస్పరం అనుసంధానమై ఉండటంతో ఒక్క పని ఆలస్యమైనా మొత్తం వ్యవస్థపై ప్రభావం పడే అవకాశం ఉంది. అందువల్ల మిగిలిన పనులను సమాంతరంగా వేగవంతం చేస్తేనే 2028 నాటికి నగరి ప్రాంతానికి నీటిని అందించాలన్న ముఖ్యమంత్రి హామీ ఆచరణలోకి వచ్చే అవకాశం ఉంటుంది. ఇన్నాళ్లూ కాగితాలపై కదిలిన నగరి జల ప్రాజెక్టుకు ఇప్పుడు నిధులు, అనుమతులు, పనుల పురోగతి రూపంలో కదలిక కనిపిస్తోంది. అయితే 2028 గడువు దగ్గరపడుతున్న నేపథ్యంలో ఈ కదలికను క్షేత్రస్థాయిలో నిర్మాణ వేగంగా మార్చడమే ప్రభుత్వానికి అసలు సవాలు కానుంది.