మొర్రిగూడెంలో గ్యాస్ సిలిండర్ల కొరత

కడెం, ఆంధ్రప్రభ : కడెం మండలంలోని పెద్ద బెల్లాల్ జిపి పరిధిలో మోర్రిగూడెం గ్రామ ప్రజలు గత నెల రోజులుగా ఇండియన్ గ్యాస్ సిలిండర్లు అందక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఖానాపూర్‌లో ఉన్న అమృత ఏజెన్సీ ద్వారా సరఫరా కావాల్సిన గ్యాస్ సిలిండర్లు సమయానికి రాకపోవడంతో గ్రామస్తులు రోజువారీ వంట అవసరాలను తీర్చుకోవడంలో కష్టాలు ఎదుర్కొంటున్నారు.
గ్రామంలోని అనేక కుటుంబాలు గ్యాస్‌పై ఆధారపడి జీవనం సాగిస్తుండగా, సిలిండర్లు అందుబాటులో లేకపోవడంతో కొందరు వృద్ధులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ సమస్యపై అమృత ఏజెన్సీ ప్రతినిధులను సంప్రదించినప్పటికీ సరైన స్పందన లేకపోవడంతో ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
వెంటనే గ్యాస్ సిలిండర్ల సరఫరా పునరుద్ధరించాలని, సమస్యను పరిష్కరించాలని గ్రామస్తులు అధికారులను కోరుతున్నారు. అధికారులు వెంటనే స్పందించి గ్రామానికి తక్షణం గ్యాస్ సిలిండర్లను సరఫరా చేయాలని, భవిష్యత్తులో ఇలాంటి సమస్యలు రాకుండా చర్యలు తీసుకోవాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.
