34 ఏళ్ల సుదీర్ఘ సేవలో ఒక్క ప్రమాదం కూడా లేదు

నేడు కదిరి డిపో డ్రైవర్ రామచంద్ర పదవీ విరమణ

శ్రీ సత్యసాయి, ఆంధ్రప్రభ: ప్రజా రవాణా వ్యవస్థలో భద్రతకు అత్యున్నత ప్రాధాన్యం ఇస్తూ 34 సంవత్సరాల సుదీర్ఘ సేవా కాలంలో ఒక్క ప్రమాదం కూడా జరగకుండా విధులు నిర్వహించిన కదిరి ఆర్టీసీ డిపో డ్రైవర్ డి. రామచంద్ర మంగళవారం (జూన్ 30) పదవీ విరమణ పొందనున్నారు. 1992లో డ్రైవర్‌గా ఆర్టీసీలో చేరిన ఆయన, క్రమశిక్షణ, నిబద్ధత, బాధ్యతాయుతమైన డ్రైవింగ్‌తో సహోద్యోగులకు ఆదర్శంగా నిలిచారు. తన సేవా కాలమంతా ప్రయాణికుల భద్రతనే ప్రధాన లక్ష్యంగా పెట్టుకుని విధులు నిర్వర్తించిన రామచంద్ర, ఒక్క ప్రమాదం కూడా జరగకుండా విజయవంతంగా ఉద్యోగ జీవితాన్ని పూర్తి చేయడం విశేషం.

రోడ్డు భద్రతపై చూపిన అంకితభావానికి గుర్తింపుగా ఆయనకు డిపో స్థాయిలో ఎనిమిది సార్లు, జిల్లా స్థాయిలో నాలుగు సార్లు, రాష్ట్ర స్థాయిలో రెండు సార్లు ఉత్తమ భద్రతా డ్రైవర్ అవార్డులు లభించాయి. జిల్లా కలెక్టర్, జిల్లా పోలీసు సూపరింటెండెంట్, రాష్ట్ర మంత్రుల చేతుల మీదుగా పలు సందర్భాల్లో ఘన సత్కారం అందుకోవడం ఆయన సేవలకు లభించిన గౌరవానికి నిదర్శనం.

ఈ సందర్భంగా డి. రామచంద్ర మాట్లాడుతూ, డ్రైవింగ్ అంటే కేవలం వాహనం నడపడం మాత్రమే కాదని, వందలాది మంది ప్రయాణికుల ప్రాణాలకు బాధ్యత వహించే సేవ అని అన్నారు. అందుకే ప్రతి రోజూ విధులకు గంట ముందుగానే డిపోకు చేరుకుని బస్సు పరిస్థితిని పరిశీలించడం, మానసిక ప్రశాంతతతో డ్యూటీ ప్రారంభించడం తన అలవాటని చెప్పారు. విధుల్లో ఎలాంటి ఒత్తిడికి లోనుకాకుండా, పూర్తి ఏకాగ్రతతో రహదారిపై దృష్టి సారించి బస్సును నడపడం వల్లే ప్రమాదాలకు అవకాశం లేకుండా చూసుకోగలిగానని వివరించారు. భద్రతా నియమాలను కచ్చితంగా పాటించడం, అతివేగానికి దూరంగా ఉండటం, ట్రాఫిక్ నిబంధనలను గౌరవించడం, ప్రయాణికుల భద్రతను ఎల్లప్పుడూ దృష్టిలో ఉంచుకోవడం ప్రతి డ్రైవర్ బాధ్యత అని ఆయన సూచించారు. యువ డ్రైవర్లు కూడా సహనం, అప్రమత్తత, బాధ్యతతో విధులు నిర్వహిస్తే ప్రమాదాలను గణనీయంగా తగ్గించవచ్చని అభిప్రాయపడ్డారు.

డి. రామచంద్ర పదవీ విరమణ సందర్భంగా కదిరి డిపోలో సహోద్యోగులు, కార్మిక సంఘాల నాయకులు ఆయన సేవలను కొనియాడారు. సంస్థకు మంచి పేరు తీసుకొచ్చిన ఆదర్శ డ్రైవర్‌గా ఆయన ఎప్పటికీ గుర్తుండిపోతారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా డిపో నాయకులు హరిమోహన్, బైరిశెట్టి, ఎన్.వి. రమణ, రామచంద్ర, దూలం ఆంజనేయులు, అశ్వర్థమయ్య, రియాజుల్లా, అబ్బాస్, బాషా, రవీంద్ర తదితరులు మాట్లాడుతూ, 34 ఏళ్ల పాటు ప్రమాదరహిత సేవలు అందించి సంస్థకు గౌరవం తీసుకొచ్చిన రామచంద్ర పదవీ విరమణ అనంతరం కూడా ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో జీవించాలని ఆకాంక్షించారు. ഭవిష్యత్ తరాలకు ఆయన సేవా స్పూర్తి ఆదర్శంగా నిలుస్తుందని పేర్కొంటూ ఘనంగా శుభాకాంక్షలు తెలిపారు.