గుత్తికోయ యువకులకు వాలీబాల్ కిట్ల పంపిణీ..
గుత్తికోయ యువకులకు వాలీబాల్ కిట్ల పంపిణీ..
- పోలీసుల అవగాహన కార్యక్రమం
ఆళ్లపల్లి, ఆంధ్రప్రభ : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ ఆదేశాల మేరకు మండల పరిధిలోని పెద్దవెంకటాపురం పంచాయతీ భూసరాయి గుత్తికోయ గిరిజన గ్రామ యువకులకు వాలీబాల్ కిట్లను పంపిణీ చేసినట్లు ఎస్ఐ ముత్తినేని సోమేశ్వర్ తెలిపారు.
ఈ సందర్భంగా భూసరాయి గ్రామంలో కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం నిర్వహించి ప్రజలకు వర్షాకాలంలో తీసుకోవాల్సిన ఆరోగ్య జాగ్రత్తలు, పరిశుభ్రత, రోడ్డు భద్రత, మూఢనమ్మకాల నివారణ తదితర అంశాలపై అవగాహన కల్పించారు.
గ్రామంలో ఎవరైనా అనుమానాస్పద వ్యక్తులు సంచరిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని, సమాచారం ఇచ్చిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని ఎస్ఐ తెలిపారు. వర్షాకాలంలో ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, అనారోగ్య సమస్యలు తలెత్తితే వెంటనే ఆసుపత్రికి వెళ్లి చికిత్స పొందాలని సూచించారు. అవసరమైతే కొత్తగూడెం ఏరియా ఆసుపత్రిలో మెరుగైన వైద్యం పొందాలని పేర్కొన్నారు.
చేతబడులు, మూఢనమ్మకాల పేరుతో ఒకరిపై ఒకరు దాడులు చేయడం, హత్యలకు పాల్పడడం వంటి ఘటనలు సమాజానికి హానికరమని తెలిపారు. అనుమానాలు ఉంటే పోలీసులను సంప్రదించాలని సూచించారు.
అలాగే సైబర్ నేరాల పట్ల ప్రజలు, ముఖ్యంగా యువత అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. మొబైల్ సందేశాలు, వాట్సాప్, ఫోన్‌పే, గూగుల్ పే, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ వంటి సామాజిక మాధ్యమాల వినియోగంలో జాగ్రత్తలు పాటించాలని అవగాహన కల్పించారు.
గ్రామ యువకుల అభ్యర్థన మేరకు వాలీబాల్ కిట్లు అందజేసి క్రీడలను ప్రోత్సహించినట్లు తెలిపారు. తెలంగాణ పోలీసు శాఖ ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉంటూ ట్రాఫిక్ నియంత్రణ, పెట్రోలింగ్, రహదారి భద్రత, వరదల సమయంలో ముంపు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడం వంటి సేవలను అందిస్తోందని వివరించారు. ఈ కార్యక్రమంలో పోలీసు సిబ్బంది, గ్రామస్తులు, యువకులు తదితరులు పాల్గొన్నారు.
