రైతుల జీవితాలతో ఆటలా?

రైతుల జీవితాలతో ఆటలా?
వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ ఆగ్రహం
నారాయణపేట ప్రతినిధి (ఆంధ్రప్రభ ) : ఓ పక్క అకాల వర్షాలతో తీవ్రంగా నష్టపోయిన రైతులకు ఊరట ఇవ్వాల్సిన సమయంలో, మరోపక్క కేంద్ర ప్రభుత్వం విధానాలతో, సీసీఐ (కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా) కఠిన నిబంధనలతో రైతులను అల్లాడిస్తున్నదని వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ బండి వేణుగోపాల్ తీవ్రంగా మండిపడ్డారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ, రైతుల కంటే పెట్టుబడిదారులు, వ్యాపారవర్గాలతో కేంద్ర ప్రభుత్వానికి ఎక్కువ మక్కువ ఉన్నదని, రైతుల జీవితాలతో చెలగాటం ఆడుతోందని ఆరోపించారు. మొదట ఎకరానికి 12 క్వింటాళ్ల పత్తి కొనుగోలు పరిమితి పెట్టిన సీసీఐ, అకస్మాత్తుగా సోమవారం నుంచి 7 క్వింటాళ్లకే పరిమితం చేయడం. తేమశాతం 8 నుంచి 12 శాతం మాత్రమే అనుమతించడం వల్ల, వర్షాల కారణంగా తేమ ఎక్కువగా ఉన్న పత్తిని రైతులు సీసీఐ కేంద్రాల్లో అమ్ముకోలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వివరించారు.
“ఇప్పటికే ఎడతెరిపి వర్షాలతో నష్టపోయిన రైతులకు కనీస మద్దతు ధర కూడా నోచుకోకపోవడం దౌర్భాగ్యం. ఆరుగాలం శ్రమించే రైతులు అప్పులు తీర్చుకోలేక ప్రాణాలు తీసుకుంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో వికసిత్ భారత్ ఎలా సాధ్యం అవుతుంది?” అని బండి వేణుగోపాల్ ప్రశ్నించారు. స్వామినాథన్ కమిషన్ నివేదిక ప్రకారం ఉత్పత్తి ఖర్చుకు అదనంగా 50% కలిపి రైతులకు మద్దతు ధర ఇచ్చి, దానికి చట్టబద్ధత కల్పించినప్పుడే నిజమైన వికసిత్ భారత్ సాధ్యమవుతుందన్నారు. జిన్నింగ్ మిల్లర్లు తమ సమస్యల పేరుతో ఈ నెల 6వ తేదీ నుంచి పత్తి కొనుగోళ్లు నిలిపివేస్తున్నట్లు ప్రకటించడాన్ని ఆయన తీవ్రంగా విమర్శించారు. “వర్షాలతో ఇప్పటికే కష్టాల్లో ఉన్న రైతులపై ఇది పుండు మీద కారం చల్లినట్టే,” అని అన్నారు. కేంద్ర ప్రభుత్వ ముందుచూపు లేకపోవడం రైతులను మరింత మానసిక ఆందోళనలకు గురిచేస్తోందని, రాష్ట్ర ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకొని ప్రతి పత్తి రైతుని ఆదుకోవాలని మాజీ మార్కెట్ చైర్మన్ బండి వేణుగోపాల్ డిమాండ్ చేశారు.
