తిరుపతిలో షాకింగ్ ఘటన.. భర్త వేధింపులు భ‌రించ‌లేక !!

  • వ్యభిచారంలోకి నెట్టాడంటూ సంచలన ఆరోపణలు
  • పదేళ్లుగా బలవంతపు వ్యభిచారం చేయించాడని భర్తపై ఆరోపణలు
  • లాడ్జీల్లో కెమెరాలు పెట్టి బ్లాక్‌మెయిల్..
  • తనకు ప్రాణహాని ఉందంటూ 112కు ఫిర్యాదు

తిరుపతి క్రైమ్, ఆంధ్రప్రభ : తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని చింతలచేనులో ఓ మహిళపై భర్త, అతని బంధువులు దాడికి పాల్పడిన ఘటన కలకలం రేపింది. బాధితురాలు మీడియాతో మాట్లాడుతూ.. తన భర్త రాజేష్ తనను పదేళ్లుగా బలవంతంగా వ్యభిచారంలోకి దింపి డబ్బు సంపాదించాడని ఆరోపించింది.

పుత్తూరు, కదిరి, వేలూరు ప్రాంతాల్లోని లాడ్జీలకు తీసుకెళ్లి వ్యభిచారం చేయించేవాడని తెలిపింది. లాడ్జి గదుల్లో ముందుగానే కెమెరాలు ఏర్పాటు చేసి అశ్లీల దృశ్యాలను చిత్రీకరించి, వాటిని విటులకు చూపిస్తూ బ్లాక్‌మెయిల్ చేసి డబ్బు వసూలు చేసేవాడని ఆమె ఆరోపించింది. ఇటీవల అనారోగ్యానికి గురికావడంతో ఇకపై వ్యభిచారం చేయనని చెప్పి పుట్టింటికి వచ్చినట్లు వెల్లడించింది.

తన అక్రమ వ్యవహారాలు బయటపడతాయనే భయంతో… తన కుటుంబ సభ్యులపై తప్పుడు కేసులు పెట్టించాడ‌ని ఆమే పేర్కొంది. ఈ నేపథ్యంలో తనపై భర్త, అతని బంధువులు దాడికి పాల్పడ్డారని, తనకు ప్రాణహాని ఉందని 112కు ఫోన్ చేసి పోలీసుల సహాయం కోరినట్లు చెప్పింది. రూ.50 లక్షల రుణంతో నిర్మించిన ఇంటి అప్పు తీరే వరకు మళ్లీ తనతో కాపురానికి రావాలని భర్త ఒత్తిడి చేస్తున్నాడని, తాను ఎంత కష్టమైనా భరించగలనేగానీ మళ్లీ ఆ జీవితంలోకి వెళ్లనని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది.