కంకర ట్రాక్టర్ ఢీకొని యువకుడి దుర్మరణం

కంకర ట్రాక్టర్ ఢీకొని యువకుడి దుర్మరణం

కంచికచర్లలో విషాదం.. మరో వ్యక్తికి గాయాలు

కంచికచర్ల, ఆంధ్రప్రభ: కంకర లోడుతో వెళ్తున్న ట్రాక్టర్ స్కూటీని ఢీకొన్న ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందగా, మరో వ్యక్తికి గాయాలైన ఘటన కంచికచర్లలో చోటుచేసుకుంది.

కంచికచర్ల పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, పరిటాల గ్రామానికి చెందిన షేక్ మహమ్మద్ రఫీ (28) దొనబండ సమీపంలోని ఎఫెక్స్ కంపెనీలో పనిచేస్తున్నాడు. శుక్రవారం రాత్రి సరుకుల కొనుగోలు నిమిత్తం తన స్నేహితుడు షరీఫ్ బుడేతో కలిసి స్కూటీపై కంచికచర్లకు వచ్చి తిరిగి పరిటాలకు వెళ్తుండగా ప్రమాదం జరిగింది.

రైతు బజార్ ఎదురుగా ఉన్న ఎన్టీఆర్ విగ్రహం సమీపంలో కంకర లోడుతో కంచికచర్ల వైపు వెళ్తున్న ట్రాక్టర్ స్కూటీని బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో రఫీ తలకు తీవ్ర గాయాలు కావడంతో అధిక రక్తస్రావం జరిగింది.

స్థానికులు వెంటనే 108 అంబులెన్స్‌లో గొల్లపూడిలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా, అప్పటికే రఫీ మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.

స్కూటీపై వెనుక కూర్చున్న షరీఫ్ బుడేకు గాయాలు కావడంతో చికిత్స నిమిత్తం నందిగామకు తరలించారు.

మృతుడు రఫీకి భార్య, పిల్లలు ఉన్నారు. ఆయన భార్య షేక్ అమీనా కౌసర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పీ. విశ్వనాథ్ తెలిపారు.