పెట్రోల్, డీజిల్ ధరలు వెంటనే తగ్గించాలి..
నాగర్‌కర్నూల్, ఆంధ్రప్రభ : కేంద్ర ప్రభుత్వం పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తూ సీపీఎం ఆధ్వర్యంలో శనివారం అంబేద్కర్ విగ్రహం ముందు నిరసన కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా సీపీఎం జిల్లా కార్యదర్శి వర్ధం పర్వతాలు మాట్లాడుతూ.. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ముందు పెట్రోల్, డీజిల్ ధరలు పెంచబోమని చెప్పిన బీజేపీ ప్రభుత్వం, ఎన్నికలు ముగిసిన పది రోజులకే దేశ ప్రజలపై ధరల భారం మోపడం దారుణమన్నారు.
ప్రజలపై పన్నుల భారం మోపడమే బీజేపీ ప్రభుత్వ విధానంగా మారిందని విమర్శించారు. వంటగ్యాస్ ధరలు కూడా ఈ ప్రభుత్వ హయాంలోనే భారీగా పెరిగాయని, దీని ప్రభావంతో అన్ని వస్తువుల ధరలు పెరిగి సామాన్య ప్రజలు ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడుతుందని అన్నారు.
కేంద్ర ప్రభుత్వం వెంటనే పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు ఆర్. శ్రీనివాస్, జిల్లా కమిటీ సభ్యులు పొదిలి రామయ్య, తారాసింగ్, జిల్లా నాయకులు నాగపూర్ మధు, సుల్తాన్, వెంకటేష్, మల్లికార్జున్ తదితరులు పాల్గొన్నారు.
