స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలి…

స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలి…

పర్యావరణాన్ని పరిరక్షించి భావితరాలకు ఆరోగ్యకరమైన వాతావరణాన్ని అందించే బాధ్యత మనందరిపై ఉంది…
సింగిల్ యూజ్ ప్లాస్టిక్ రహిత ఏలూరు జిల్లాగా మార్చడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశం…కలెక్టర్ వెట్రి సెల్వి.

ఏలూరు బ్యూరో, ఆంధ్రప్రభ : ముసునూరు మండలం వలసపల్లి గ్రామంలో శనివారం స్వర్ణాంధ్ర -స్వచ్ఛాంధ్ర (సా.సా) కార్యక్రమంలో భాగంగా “ప్లాస్టిక్ రహిత రాష్ట్రం” అనే ఇతివృత్తంతో కార్యక్రమాన్ని జిల్లా కలెక్టరు కె.వెట్రిసెల్వి లాంఛనంగా ప్రారంభించారు. డంపింగు యార్డు, శ్రీ వరలక్ష్మి జనరల్ స్టోర్స్, ఇంటింటికి వెళ్ళి క్లాప్ మిత్రాలు రోజు వస్తున్నారా అని ఆరా తీశారు. డ్రైనేజీని పరిశీలించి అధికారులకు కొన్ని సూచనలను జారీ చేశారు. స్వచ్ఛ రథాన్ని పరిశీలించి, రోజుకు ఎన్ని ఇల్లు కవర్ చేస్తున్నారని, దానిలో ఉన్న నిత్యవసర సరుకులను పరిశీలించారు. క్లాప్ మిత్రాలను సన్మానించి, వారితో కలసి టీత్రాగుతూ కుటుంబ సభ్యులు యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు.

రచ్చబండ దగ్గర కూర్చుని ప్రజలతో మమేకమై గ్రామజీవన విధానాన్ని అడిగి తెలుసుకున్నారు. ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుటకు ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా స్వీకరించాలని, ప్రజలకు గన్ని సంచులను పంపిణీ చేసి, అందరిచేత జిల్లా కలెక్టరు ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టరు కె.వెట్రిసెల్వి మాట్లాడుతూ ప్రతి మూడవ శనివారం నిర్వహించే స్వర్ణాంధ్ర – స్వచ్ఛాంధ్ర (సా.సా) కార్యక్రమంలో భాగంగా “ప్లాస్టిక్ రహిత రాష్ట్రం” అనే ఇతివృత్తంతో కార్యక్రమాన్ని జిల్లా వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో విజయవంతంగా జరుగుతున్నాయన్నారు.

ప్లాస్టిక్ రహిత లక్ష్యంగా ప్రజలు భాగస్వామ్యంతో సింగల్ యూజ్ ప్లాస్టిక్‌ను పూర్తిగా నిషేధించి, ప్లాస్టిక్ రహిత జిల్లాగా రూపొందించేలా ప్రతి ఒక్కరూ ఆలోచనలు చేసి ముందుకు అడుగులు వెయ్యాలని అన్నారు. ప్లాస్టిక్, క్యారీ బ్యాగులు ప్రత్యామ్నాయంగా గన్ని, క్లాత్ సంచులు వాడుకోవాలని అన్నారు. ప్రతి గ్రామం, పట్టణ స్థాయిలో పారిశుద్ధ్యానికి పెద్దపీట వెయ్యాలని, తడి-పొడి చెత్తను వేరువేరుగా సేకరించడం చెయ్యాలని అన్నారు. చెత్త నుండి సంపద తయారీ కేంద్రాలు నిర్వహణను పక్కాగా చేపట్టాలని, ప్రతి ఒక్కరిలో మంచి ఆలోచనతో మార్పు రావాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజలు, స్వయం సహాయక సంఘాలు, యువత, వ్యాపారవేత్తలు, గ్రీన్ అంబాసిడర్లు భాగస్వామ్యులై పరిసరాలను శుభ్రంగా ఉంచాలని అన్నారు. జూన్/అక్టోబర్ 2026 నాటికి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ రహిత రాష్ట్రంగా మార్చడమే ప్రధాన ఉద్దేశంగా రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతను ఇస్తోందని అన్నారు.

ప్రజలలో పర్యావరణం పట్ల అవగాహన పెంచి, పరిశుభ్రతను ఒక జీవన విధానంగా మార్చాలని లక్ష్యంగా పెట్టుకున్నామని అన్నారు. వ్యర్థాలు నుండి సంపద సృష్టించడం, ఈ- వ్యర్థాలు సేకరణ, సురక్షిత మైన రీసైక్లింగు పద్ధతులుపై అవగాహన కల్పించడం చెయ్యాలని అన్నారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా మొక్కలు నాటడం, చెట్లు సంరక్షణ కార్యక్రమాలు చేపట్టడం, ప్లాస్టిక్, క్యారీ బ్యాగులు వాడకాన్ని తగ్గించడం, నీటి సంరక్షణపై దృష్టి సారించడం దృష్టి పెట్టాలని అన్నారు. ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు, విద్యార్థులు, యువత, స్వచ్ఛందసంస్థలు భాగస్వామ్యం అయ్యి పరిసరాలు పరిశుభ్రత కార్యక్రమాలు, ప్రజలకు అవగాహన పెంచుకుని ముందుకు వచ్చి ఆదర్శ గ్రామాలుగా తీర్చిదిద్దు కోవాలని తెలిపారు.

ఈ కార్యక్రమంలో సబ్ కలెక్టరు బొల్లిపల్లి వినూత్న, జెడ్పీ సిఈవో పి.జగదాంబ, జిల్లా పంచాయతీశాఖ అధికారి కె.అనురాధ, డివిజనల్ పంచాయతీ అధికారి యం.పి.యన్. సుందరి, తహశీల్దారు డి.ప్రశాంతి, ఇంచార్చి యంపిడివో బి.ఏ. సత్యనారాయణ, వివిధ శాఖలు అధికారులు, గ్రామ సచివాలయం ఉద్యోగులు, గ్రామ పెద్దలు, ప్రజలు, క్లాప్ మిత్రాలు పాల్గొన్నారు.

Leave a Reply