ఇంధన భారం పై వైసీపీ పోరుబాట..

ఇంధన భారం పై వైసీపీ పోరుబాట..

పెట్రోల్, డీజిల్ ధరల పెంపుపై నేడు జిల్లా వ్యాప్తంగా నిరసనలు
ఎన్నికల హామీలు ఏమయ్యాయని కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న వైసీపీ
దేశంలోనే అత్యధిక ఇంధన ధరలు ఏపీలోనేనని ఆరోపణ
రైతులు, రవాణా రంగం, మధ్యతరగతిపై తీవ్ర ప్రభావమని ఆందోళన
రేపు అన్ని నియోజకవర్గాల్లో ధర్నాలు..
అధికారులకు వినతిపత్రాల సమర్పణ
వైసీపీ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్…

విజయవాడ, ఆంధ్రప్రభ : వైస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పెట్రోల్, డీజిల్ ధరల పెంపుపై నేడు జిల్లా వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చారు. ఎన్నికల ముందు ప్రజలకు ఇంధన ధరల భారం తగ్గిస్తామని హామీలు ఇచ్చిన కూటమి నేతలు, అధికారంలోకి వచ్చిన తర్వాత ధరలను తగ్గించకపోగా మరింత పెంచడం ప్రజలను మోసం చేయడమేనని వైసీపీ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్ మండిపడ్డారు. ఇటీవల దేశవ్యాప్తంగా చమురు కంపెనీలు పెట్రోల్, డీజిల్ ధరలను లీటరుకు సుమారు రూ.3 మేర పెంచిన నేపథ్యంలో సాధారణ ప్రజలపై మరింత భారం పడిందని పేర్కొన్నారు. ఆంధ్ర ప్రదేశ్ లో ఇప్పటికే పెట్రోల్, డీజిల్ ధరలు ఇతర రాష్ట్రాలతో పోలిస్తే అధికంగా ఉన్నాయని ఆరోపించారు. ఇంధన ధరల పెంపు ప్రభావం రైతాంగం, రవాణా రంగం, చిన్న వ్యాపారులు, ఆటో డ్రైవర్లు, మధ్యతరగతి కుటుంబాలపై తీవ్రంగా పడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. డీజిల్ ధరలు పెరగడంతో వ్యవసాయ యంత్రాల నిర్వహణ వ్యయం పెరిగిందని, రవాణా ఖర్చులు పెరగడంతో నిత్యావసర సరుకుల ధరలపై కూడా ప్రభావం పడుతోందని పేర్కొన్నారు.

అందరూ భాగస్వాములు కావాలి..

జిల్లావ్యాప్తంగా పార్టీ శ్రేణులు, ప్రజాప్రతినిధులు, అనుబంధ విభాగాల నాయకులు సమన్వయంతో అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు వైసిపి అధ్యక్షుడు దేవినేని అవినాష్ వెల్లడించారు. అనంతరం సంబంధిత రెవెన్యూ, పౌరసరఫరాల అధికారులకు వినతిపత్రాలు సమర్పించి ఇంధన ధరల పెంపును వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తామన్నారు. ప్రజలపై ఆర్థిక భారం మోపే నిర్ణయాలను ప్రభుత్వం పునఃసమీక్షించాలని, ఎన్నికల హామీలను అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.