పోలియో రహిత సమాజం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలి

వేములవాడ, ఆంధ్రప్రభ: పోలియో రహిత సమాజం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని వేములవాడ శాసనసభ్యులు, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పిలుపునిచ్చారు. జిల్లా వైద్యశాఖ ఆధ్వర్యంలో ఆదివారం వేములవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో నిర్వహించిన పల్స్ పోలియో కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మున్సిపల్ చైర్మన్ పుల్కం రాజుతో కలిసి ఆయన చిన్నారులకు పోలియో చుక్కలు వేసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ.. దేశాన్ని పోలియో రహితంగా నిలబెట్టడంలో పల్స్ పోలియో కార్యక్రమం కీలక పాత్ర పోషిస్తోందన్నారు. ఐదేళ్లలోపు ఒక్క చిన్నారి కూడా పోలియో చుక్కలకు దూరం కాకుండా తల్లిదండ్రులు బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు. చిన్నారుల ఆరోగ్య సంరక్షణకు రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని, వైద్యశాఖ చేపట్టే ప్రజారోగ్య కార్యక్రమాలకు ప్రజలు పూర్తి సహకారం అందించాలని కోరారు.

ఈ కార్యక్రమంలో జిల్లా వైద్యాధికారి డాక్టర్ ఏంజల ఆల్ఫ్రెడ్, ప్రాంతీయ ఆసుపత్రి సూపరిండెంట్ డాక్టర్ రవీందర్, జిల్లా ప్రోగ్రామ్ అధికారులు డాక్టర్ పవిత్ర, జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి సంపత్, వైస్ చైర్మన్ నరాల శేఖర్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ కనికరపు రాకేష్, కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు తూము మధు, కౌన్సిలర్లు, వైద్య సిబ్బంది మరియు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.