ప్రాణాలు తీసిన.. ఈత సరదా..

ప్రాణాలు తీసిన.. ఈత సరదా..
- ఇద్దరు యువకుల మృత్యువాత
- మధ్య మానేరులో ఘటన
- సిరిసిల్ల, చీర్లవంచలో విషాదం
వేములవాడ, ఆంధ్రప్రభ : యువకుల ఈత సరదా.. నిండు ప్రాణాలను బలి తీసుకుంది.. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ అర్బన్ మండలం కొడుముంజ గ్రామంలో శుక్రవారం తీవ్ర విషాద ఘటన చోటుచేసుకుంది. కొడుముంజ గ్రామ సమీపంలోని రామప్ప ఆలయం వద్ద మద్య మానేరులో ఈతకు వెళ్లిన ఇద్దరు యువకులు మృత్యువాత పడ్డారు. స్థానికులు, ఘటన స్థలానికి వెళ్లిన పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సిరిసిల్ల పట్టణంలోని శాంతినగర్కు చెందిన హరిచరణ్ గౌడ్ (18), చీర్లవంచ ఆర్ అండ్ ఆర్ కాలనీకి చెందిన మణికంఠ (17) అనే ఇద్దరు యువకులు కొడుముంజ గ్రామంలోని రామప్ప ఆలయ పరిసర ప్రాంతానికి వచ్చారు.
ఈ క్రమంలోనే అక్కడ నీటిలోకి సరదాగా ఈత కొట్టేందుకు మిడ్ మానేరులోకి దిగారు. అయితే ప్రమాదవశాత్తు నీటి లోతును గమనించని యువకులు నీటిలో మునిగిపోయారు. సమీపంలో ఉన్న వారు గమనించేలోపే ఇద్దరు యువకులు నీట మునిగి ప్రాణాలు విడిచారు. పోలీసు అధికారులు సిబ్బంది స్థానికుల సహాయంతో మృతదేహాలను నీటి నుండి వెలికితీసి, క్షుణ్ణంగా పరిశీలించారు.
ఈ విషయం తెలియగానే మృతుల కుటుంబ సభ్యులు, బంధువులు సంఘటనా స్థలానికి చేరుకుని కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. చేతికందివచ్చిన కొడుకులు కళ్లముందే శవాలుగా మారడంతో ఆయా కుటుంబాల్లో గుండెకోత మిగిలింది. యువకుల మృతితో కొడుముంజ గ్రామంలోనూ, మృతుల స్వగ్రామాల్లోనూ విషాద ఛాయలు అలుముకున్నాయి. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చె సుకుని దర్యాప్తు చేపట్టారు. యువకుల మృతి సిరిసిల్ల, చీర్లవండ గ్రామాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది.
