మామిడి తోట మంటల కేసులో కీలక మలుపు

మామిడి తోట మంటల కేసులో కీలక మలుపు
తొర్రూరు టౌన్, ఆంధ్రప్రభ: మాటేడు గ్రామ శివారులో జరిగిన అగ్నిప్రమాదానికి కారణమైన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు తొర్రూరు ఎస్సై మహేందర్ రెడ్డి తెలిపారు.
ఇటీవల మాటేడు గ్రామ శివారులో జరిగిన అగ్నిప్రమాదంలో భారీగా మామిడి తోటలు, ఇతర పంటలు దగ్ధమయ్యాయి. ఈ ఘటనతో రైతులు తీవ్ర ఆర్థిక నష్టాన్ని ఎదుర్కొన్నారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
విచారణలో భాగంగా ఈ ప్రమాదానికి కారణమైన నిందితుడు శివరాత్రి వెంకటయ్యను సోమవారం అరెస్ట్ చేసినట్లు ఎస్సై వెల్లడించారు. అనంతరం అతనిని కోర్టులో హాజరుపరచగా న్యాయస్థానం రిమాండ్ విధించడంతో జైలుకు తరలించినట్లు తెలిపారు.
ఈ సందర్భంగా ఎస్సై మహేందర్ రెడ్డి రైతులకు, ప్రజలకు పలు సూచనలు చేశారు. పంటల అవశేషాలను ఎట్టి పరిస్థితుల్లోనూ కాల్చవద్దని ఆయన హెచ్చరించారు. వేసవి కాలంలో చిన్న నిప్పుకణిక కూడా పెద్ద ప్రమాదానికి దారితీసి సమీపంలోని తోటలు, ఆస్తులకు నష్టం కలిగించే అవకాశం ఉందని తెలిపారు.
నిబంధనలు ఉల్లంఘించి పంట అవశేషాలను కాల్చినా లేదా ఇతరుల ఆస్తులకు నష్టం కలిగించినా కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు. రైతులు కష్టపడి పెంచిన పంటలు నష్టపోకుండా అందరూ బాధ్యతగా వ్యవహరించాలని ఆయన సూచించారు.
