ధాన్యం కొనుగోలు అంశంపై కీలక వ్యాఖ్యలు

ధాన్యం కొనుగోలు అంశంపై కీలక వ్యాఖ్యలు
కేంద్రంపై ఎమ్మెల్యే సంచలన డిమాండ్
మోత్కూరు, ఆంధ్రప్రభ: రైతులు పండించిన ధాన్యాన్ని రాష్ట్ర ప్రభుత్వంతో పాటు కేంద్ర ప్రభుత్వం కూడా కొనుగోలు చేయాల్సిన బాధ్యత ఉందని తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామెల్ అన్నారు.
సోమవారం మున్సిపల్ కేంద్రంలోని రహదారి బంగ్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే పాల్గొని మాట్లాడారు. వారం రోజుల్లో రైతుల ధాన్యం పూర్తిగా కొనుగోలు చేయాలని మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి జిల్లా కలెక్టర్లకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారని ఆయన తెలిపారు.
ప్రతిపక్షాలు చేస్తున్న అసత్య ఆరోపణలను ప్రజలు నమ్మరని ఎమ్మెల్యే సామెల్ పేర్కొన్నారు. తెలంగాణ మలిదశ ఉద్యమ తొలి అమరుడు కాసోజు శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మను రాష్ట్ర మహిళా కమిషన్ సభ్యురాలిగా కాంగ్రెస్ ప్రభుత్వం నియమించి గౌరవించిందని తెలిపారు. అదేవిధంగా చాకలి ఐలమ్మ మనవరాలు శ్వేతను కూడా మహిళా కమిషన్ సభ్యురాలిగా నియమించి బడుగు, బలహీన వర్గాలు, ఉద్యమకారుల కుటుంబాలకు ప్రాధాన్యం ఇచ్చినట్లు చెప్పారు.
సోనియాగాంధీ తెలంగాణ రాష్ట్రం ఇవ్వకపోతే అందరూ జీరోలేనని ఆయన వ్యాఖ్యానించారు. ఈ నెల 28న మోత్కూరులో జరగాల్సిన శంకరమ్మ సన్మాన కార్యక్రమం 29వ తేదీకి వాయిదా పడిందని తెలిపారు. మీనాక్షి ఫంక్షన్ హాల్‌లో జరిగే ఈ కార్యక్రమానికి ప్రతి గ్రామం నుంచి 100 మందిని సభకు తీసుకురావాలని సర్పంచ్‌లకు సూచించారు. ఈ కార్యక్రమానికి గిరిజన శాఖ మంత్రి అట్లూరు లక్ష్మణ్ ముఖ్య అతిథిగా హాజరవుతారని ఆయన వెల్లడించారు.
అసంపూర్తిగా ఉన్న మోత్కూరు–రాజన్నగూడెం రహదారిని వెంటనే పూర్తి చేయాలని, మోత్కూరు బ్రిడ్జి నిర్మాణానికి చర్యలు చేపట్టాలని ఆర్ అండ్ బి సీఈ మోహన్ నాయక్‌ను ఫోన్‌లో సంప్రదించి కోరినట్లు ఎమ్మెల్యే తెలిపారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ గడ్డం స్వప్న సోమనరసయ్య, మార్కెట్ చైర్మన్ నూనె ముంతల విమల వెంకటేశ్వర్లు, పీఏసీఎస్ చైర్మన్ పేలపూడి వెంకటేశ్వర్లు, జిల్లా కాంగ్రెస్ మాజీ ఉపాధ్యక్షుడు ఫైళ్ల సోమిరెడ్డి, జిల్లా కాంగ్రెస్ నాయకుడు డా. గుర్రం లక్ష్మీనరసింహారెడ్డి, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు గుండగోని రామచంద్ర గౌడ్, కౌన్సిలర్లు పన్నాల శ్రీవిద్య, కారుపోతుల వెంకన్న గౌడ్, మాజీ ఎంపీటీసీ ముద్దం జయశ్రీ, మార్కెట్ డైరెక్టర్లు పన్నాల శ్రీనివాస్ రెడ్డి, పోచం జగన్, ఎండి సమీరుద్దీన్, సర్పంచ్‌లు ఫైళ్ల నర్సిరెడ్డి, అంతటి భగవంతు, జిట్ట సైదులు, నీలకంఠం, నాయకులు ఎడ్ల శ్రీనివాస్, అనిత, పోలోజు శేఖరాచారి తదితరులు పాల్గొన్నారు.
