కదిరి మున్సిపల్ కమిషనర్‌గా పి.అజయ్ కుమార్ నియామకం

కదిరి మున్సిపల్ కమిషనర్‌గా పి.అజయ్ కుమార్ నియామకం

శ్రీ సత్యసాయి, ఆంధ్రప్రభ: రాష్ట్రంలో మున్సిపల్ పరిపాలనను మరింత సమర్థవంతంగా నిర్వహించేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పరిపాలనా అవసరాల దృష్ట్యా వివిధ శాఖల్లో పనిచేస్తున్న పలువురు అధికారులను మున్సిపల్ పరిపాలన శాఖలో డిప్యూటేషన్ ప్రాతిపదికన నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్‌మెంట్ (ఎంఏ అండ్ యూడీ) శాఖ జూన్ 4న జీఓ ఆర్టీ నెం.700ను విడుదల చేసింది.

ఉత్తర్వుల ప్రకారం, శ్రీ సత్యసాయి జిల్లాలో అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్‌గా పనిచేస్తున్న పి. అజయ్ కుమార్‌ను కదిరి మున్సిపల్ కమిషనర్‌గా నియమించారు. ప్రస్తుతం ఖాళీగా ఉన్న ఈ పదవిలో ఆయనను ఒక సంవత్సరం కాలపరిమితితో డిప్యూటేషన్‌పై నియమించినట్లు ప్రభుత్వం వెల్లడించింది. దీంతో కదిరి మున్సిపాలిటీకి పూర్తి స్థాయి కమిషనర్ అందుబాటులోకి రానున్నారు.

ఇప్పటికే కదిరి మున్సిపాలిటీకి ప్రత్యేక అధికారిగా జిల్లా జాయింట్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ వ్యవహరిస్తున్నారు. వేగంగా అభివృద్ధి చెందుతున్న పట్టణంగా కదిరి గుర్తింపు పొందుతున్న నేపథ్యంలో మౌలిక వసతుల అభివృద్ధి, పారిశుధ్య నిర్వహణ, తాగునీటి సరఫరా, పట్టణ ప్రణాళిక వంటి అంశాల్లో సమర్థవంతమైన పరిపాలన అవసరమవుతోంది. ఈ పరిస్థితుల్లో కొత్త కమిషనర్ నియామకం ప్రాధాన్యత సంతరించుకుంది.

కొత్త కమిషనర్ బాధ్యతలు స్వీకరించిన అనంతరం పట్టణ అభివృద్ధి కార్యక్రమాలు మరింత వేగవంతం అవుతాయని అధికారులు భావిస్తున్నారు. పెండింగ్‌లో ఉన్న అభివృద్ధి పనులు, ప్రజా సమస్యల పరిష్కారం, ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల అమలుపై ప్రత్యేక దృష్టి సారించే అవకాశం ఉందని పేర్కొంటున్నారు.

ఇదే ఉత్తర్వుల్లో భాగంగా మరో నలుగురు అధికారులకు కూడా వివిధ మున్సిపాలిటీల్లో పోస్టింగ్‌లు కల్పించారు. జనరల్ అడ్మినిస్ట్రేషన్ శాఖలో సెక్షన్ ఆఫీసర్‌గా పనిచేస్తున్న ఎన్. శ్రీనివాసరావును విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ జోనల్ కమిషనర్‌గా, ఎం. హాసినిని బాపట్ల మున్సిపల్ కమిషనర్‌గా, ఎస్‌టీవీ రాజేశ్వరరావును పిఠాపురం మున్సిపల్ కమిషనర్‌గా, వై. మల్లికార్జునరావును గూడూరు మున్సిపల్ కమిషనర్‌గా నియమించారు.

ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు నియమితులైన అధికారులు తమ ప్రస్తుత శాఖల నుంచి వెంటనే రిలీవ్ అయి కొత్త బాధ్యతల్లో చేరాల్సి ఉంటుంది. అవసరమైన తదుపరి చర్యలను మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కమిషనర్, డైరెక్టర్ చేపట్టాలని ప్రభుత్వం ఆదేశించింది.

కదిరి పట్టణ ప్రజాప్రతినిధులు, అధికారులు, స్థానిక వర్గాలు కొత్త కమిషనర్ నియామకాన్ని స్వాగతిస్తున్నాయి. ఈ నియామకం కదిరి మున్సిపాలిటీ పరిపాలనకు కొత్త ఊపునిస్తుందని, పట్టణాభివృద్ధికి మరింత వేగం చేకూరుస్తుందని ఆశాభావం వ్యక్తమవుతోంది.