AP Green Mission | 2047 నాటికి 50 శాతం గ్రీనరీ లక్ష్యం
AP Green Mission | 2047 నాటికి 50 శాతం గ్రీనరీ లక్ష్యం
AP Green Mission | హరితాంధ్రప్రదేశ్ లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వ భారీ ప్రణాళిక
ఈ ఏడాది రాష్ట్రవ్యాప్తంగా 10 కోట్ల మొక్కల నాటకం
మూలపాడులో 2.5 కోట్ల సీడ్ బాల్స్ తయారీ కార్యక్రమం
డ్రోన్ పద్ధతిలో విత్తనాల చల్లే విధానంపై పరిశీలన
పచ్చదనం పెంపులో 13 కీలక శాఖల భాగస్వామ్యం
పర్యావరణ పరిరక్షణకు కూటమి ప్రభుత్వ చర్యలు
AP Green Mission | అమరావతి, ఆంధ్రప్రభ: ఓ వైపు అభివృద్ధికి పెద్దపీట వేస్తూనే, మరో వైపు వాతావరణ సమతుల్యత, కార్బన్ ఉద్గారాలను తగ్గించేందుకు, కాలుష్యాన్ని అరికట్టేందుకు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. ఆంధ్రప్రదేశ్‌ను హరితాంధ్రప్రదేశ్‌గా తీర్చిదిద్దేందుకు భారీ ప్రణాళికలను రూపొందిస్తోంది.
ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆధ్వర్యంలో అటవీ, పరిశ్రమలు, పెట్టుబడులు, మౌలిక వసతుల కల్పన శాఖలతో పాటు మొత్తం 13 కీలకమైన శాఖలను పచ్చదనం పెంపొందించే కార్యక్రమాల్లో భాగస్వామ్యులను చేస్తున్నారు. ఏపీకి పచ్చని హారంగా ఈ ఏడాది రాష్ట్రవ్యాప్తంగా 10 కోట్ల మొక్కలను నాటేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. అందులో భాగంగా ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా శుక్రవారం ఎన్టీఆర్ జిల్లా మూలపాడు బటర్‌ఫ్లై పార్కులో 2.5 కోట్ల సీడ్ బాల్స్ తయారీ కార్యక్రమాన్ని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రారంభించనున్నారు.
50 శాతం పచ్చదనం లక్ష్యంగా…
రాష్ట్రంలో పచ్చదనానికి పెద్దపీట వేయాలి. ప్రస్తుతం ఉన్న 30 శాతం గ్రీనరీని 2047 నాటికి 50 శాతానికి పెంచాలి. అందుకోసం దశలవారీగా లక్ష్యాలను నిర్దేశించుకుని ముందుకు సాగాలి. 50 శాతం గ్రీనరీ డెవలప్‌మెంట్ చేసే కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని ఇప్పటికే మార్గదర్శకాలు జారీ చేశారు. అందులో భాగంగా 2030 నాటికి 37 శాతానికి చేరాలంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆదేశాలు జారీ చేశారు.
ఆ దిశగా రాష్ట్ర స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు ప్రత్యేక వ్యవస్థలను సిద్ధం చేస్తున్నారు. ఇప్పటి వరకు అటవీ శాఖ, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వంటి ఒకటి, రెండు డిపార్ట్‌మెంట్లు మాత్రమే పచ్చదనం పెంపొందించేందుకు పనిచేస్తున్నాయి. ఇప్పుడు జిల్లా స్థాయిలో పంచాయతీరాజ్, పట్టణాభివృద్ధి, వ్యవసాయ, ఉద్యానశాఖ, పరిశ్రమలు, పొల్యూషన్ బోర్డు వంటి 13 సంస్థలకు పైగానే ఇందులో భాగస్వామ్యం కానున్నాయి.
సీడ్ బాల్స్ తయారీ పరిశీలించి…
ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా రాష్ట్రంలో పెద్ద ఎత్తున మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది. అటవీ, పర్యావరణ శాఖ మంత్రి హోదాలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మూలపాడులో గురువారం ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. అక్కడ మొక్కలను నాటి, సీడ్ బాల్స్ తయారీ పద్ధతి, సాంప్రదాయ పద్ధతిలో విత్తనాలు సిద్ధం చేయడం, డ్రోన్ పద్ధతి ద్వారా అత్యంత ఎత్తైన ప్రాంతాలు, మైదాన ప్రాంతాల్లో తక్కువ ఖర్చుతో ఎక్కువ విస్తీర్ణంలో విత్తనాలను చల్లే విధానాలను పరిశీలించనున్నారు.
అధికారులు ముమ్మర ఏర్పాట్లు…
రాష్ట్రవ్యాప్తంగా ఈ ఏడాది 10 కోట్ల మొక్కలను నాటే కార్యక్రమాన్ని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రారంభించనున్న నేపథ్యంలో మూలపాడు వద్ద ఏర్పాట్లను బుధవారం అటవీశాఖ ప్రధాన ముఖ్య సంరక్షణాధికారి, అటవీ దళాధిపతి డాక్టర్ పీవీ చలపతిరావు, అధికారులు పరిశీలించారు. డిప్యూటీ సీఎం పర్యటన నేపథ్యంలో ఎలాంటి లోటుపాట్లు లేకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అటవీ సంరక్షణాధికారి మూర్తి, డిప్యూటీ సీఎఫ్ నాగభూషణం, అధికారులు పాల్గొన్నారు.
