ఎండుతున్న నారుమళ్లు.. ఎల్నినోతో ఖరీఫ్‌పై కరవు నీడ

ఎండుతున్న నారుమళ్లు.. ఎల్నినోతో ఖరీఫ్‌పై కరవు నీడ

  • ఎల్నినో ప్రభావంతో 63 శాతం వర్షపాతం లోటు
  • వరుణుడి కోసం ఎదురుచూస్తున్న అన్నదాతలు
  • ఎండిపోతున్న నారుమళ్లు.. సాగునీటి కోసం రైతుల ఆందోళన
  • తక్కువ నీటితో పండే పంటలపై వ్యవసాయ శాఖ సూచనలు
  • ఎల్నినో ప్రభావం వచ్చే ఏడాది వరకు కొనసాగే అవకాశం

అమరావతి, ఆంధ్రప్రభ: ఖరీఫ్ సాగుపై అన్నదాత అయోమయ పరిస్థితిలో పడ్డాడు. ప్రధానంగా ఎల్నినో ప్రభావంతో ఈ ఏడాది వర్షాలు తగ్గుతాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేయడంతో సాగుపై రైతుల్లో ఆందోళన నెలకొంది. కొన్ని జిల్లాల్లో వరి నారు పోసుకున్న రైతులు ఇప్పుడు వర్షాలు కురవకపోవడంతో వరి నారును బిందెలతో తడుపుతూ బతికించుకుంటున్నారు. మరోవైపు రిజర్వాయర్లలో కూడా కనీస స్థాయిలో నీటి మట్టాలు లేవు. చెరువుల్లోనూ నీరు చేరలేదు. ఈసారి ముందే కరువు పరిస్థితులు కనిపిస్తున్నాయి.

ఎండుతున్న నారుమళ్లు!

సీజన్ ఆరంభంలోనే రైతులకు సాగునీటి కష్టాలు తప్పడం లేదు. వర్షాకాలం ప్రారంభమైనా ఎక్కడా చినుకు జాడలేదు. నైరుతి రుతుపవనాలు ప్రవేశించినా.. ఇప్పటివరకు ఆశించిన స్థాయిలో వర్షాలు కురవలేదు. ఎల్నినో ప్రభావంతో జూన్‌లో సాధారణం కన్నా తక్కువ వర్షపాతం నమోదైంది. ఈ నెలలోనూ అదే పరిస్థితి నెలకొంది. తొలకరి జల్లును నమ్మి పలు జిల్లాల్లో రైతులు వరి నారు, ఎదలు వేశారు. కాగా ప్రస్తుతం వరుణుడు ముఖం చాటేయడంతో నారుమళ్లు, ఎదలు ఎండిపోతున్నాయని రైతులు ఆందోళన చెందుతున్నారు. కొన్నిచోట్ల మొలకలు కూడా రాకపోవడంతో వరుణుడి కరుణ కోసం ఎదురుచూస్తున్నారు. నారుమడులకు నీటితడి అందించేందుకు నానా పాట్లు పడుతున్నారు.

మొత్తం సీజన్‌పై ప్రభావం

రాష్ట్రంలో అత్యధిక సాగు ఖరీఫ్‌లోనే సాగుతుంది. సీజన్‌లో దాదాపు 80 లక్షల ఎకరాల్లో వ్యవసాయ పంటలు సాగుకు ప్రభుత్వం ప్రణాళిక రచించింది. కూరగాయలు, ఉద్యాన పంటలతో కలిపితే కోటి ఎకరాల సేద్యం ఒక్క ఖరీఫ్‌లోనే జరుగుతుంది. ఆదిలోనే తీవ్ర వర్షాభావం నెలకొనడంతో మొత్తం సీజన్‌పై ప్రభావం చూపిస్తుందన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.

గత అక్టోబర్, నవంబర్‌లో తరచూ తుఫాన్లు వచ్చి చేతికొచ్చిన పంటలను ఊడ్చిపెట్టిన అనుభవంతో ఈసారి పంటకాలాన్ని ముందుకు జరపాలని ప్రభుత్వం ఆశించింది. ముందుగానే కాల్వలకు నీరు విడుదల చేయడానికి క్యాలెండర్ కూడా ప్రకటించింది. కానీ జూన్ నుంచి ఇప్పటి వరకు తీవ్ర వర్షాభావం ఏర్పడటంతో ప్రభుత్వ అంచనాలు తప్పాయి. జూలై సగం దాటినా వర్షాలు నిరాశాజనకంగా ఉండడంతో రైతులు ఖరీఫ్ సేద్యంపై సందిగ్ధంలో పడ్డారు.

అత్యల్ప వర్షపాతం నమోదు

ఈ ఏడాది రాష్ట్రంలో సగటు సాధారణ వర్షపాతంలో ఏకంగా 63 శాతం లోటు నమోదైంది. జూన్ 1 నుంచి ఇప్పటి వరకు సాధారణ వర్షపాతం 80 మిల్లీమీటర్లు ఉండాల్సి ఉండగా, కేవలం 30 మిల్లీమీటర్లు మాత్రమే కురిసింది. 28 జిల్లాల్లో 17 జిల్లాల్లో అత్యల్ప వర్షపాతం నమోదైంది. మైనస్ 60 నుంచి 99 శాతం వరకు వర్షాల లోటు నమోదైంది.

విజయనగరం, మన్యం, అల్లూరి, విశాఖపట్నం, కాకినాడ, కోనసీమ, తూర్పు, పశ్చిమ గోదావరి, బాపట్ల, కర్నూలు, నంద్యాల, శ్రీ సత్యసాయి, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి, మార్కాపురం, పోలవరం జిల్లాల్లో అత్యల్ప స్థాయిలో వర్షం పడింది. నంద్యాలలో రాష్ట్రంలోనే అత్యల్ప వర్షపాతం నమోదైంది. 80 శాతం కంటే ఎక్కువ లోటు నమోదైన జిల్లాల్లో అన్నమయ్య, పశ్చిమ గోదావరి జిల్లాలు ఉన్నాయి.

సాగు ప్రణాళికలో మార్పులు

ఎల్నినో ప్రభావం వల్ల తక్కువ నీటితో పండే పంటలు వేసుకోవడం మంచిదని వ్యవసాయ అధికారులు సూచిస్తున్నారు. ఖరీఫ్ సీజన్‌లో ఆరుతడి పంటలైన మొక్కజొన్న, ప్రత్తి, వంగ, టమోటా, బెండ, చిక్కుడు వంటి పంటలు సాగు చేయాలని సూచిస్తున్నారు. నేల స్వభావానికి అనుగుణంగా పంటలను ఎంపిక చేసుకోవాలని చెబుతున్నారు.

కరువును తట్టుకునే విత్తనాలు, సజ్జలు, రాగులు, కొర్రలు, చిరుధాన్యాలు, కందులు, పెసలు వంటి పంటలు సాగు చేయడం శ్రేయస్కరం. వర్షాలు తక్కువగా ఉండే అవకాశం ఉన్నందున స్వల్పకాలిక పంటలు ఎంచుకోవాలని సూచిస్తున్నారు. రసాయన ఎరువుల వాడకం తగ్గించి నేల తేమను నిలుపుకునే సహజ వ్యవసాయ పద్ధతులు పాటించాలని పేర్కొంటున్నారు.

బిందు సేద్యం, స్ప్రింక్లర్ సేద్యం ద్వారా నీటి వృథాను అరికట్టాలని అధికారులు సూచిస్తున్నారు. ఉష్ణోగ్రతలు పెరిగితే పురుగుల ఉధృతి పెరిగే అవకాశం ఉండటంతో పంటలను నిరంతరం పరిశీలిస్తూ నివారణ చర్యలు తీసుకోవాలని సూచించారు. కరువు సమయంలో పశువులకు గడ్డి కొరత రాకుండా ముందుగానే పశుగ్రాసం నిల్వ చేసుకోవడం కూడా అవసరమని తెలిపారు.

ఎల్నినో ప్రభావం

ఎల్నినో అంటే పసిఫిక్ మహాసముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు పెరిగి భారతదేశంలో రుతుపవనాలు బలహీనపడటం. అదే సమయంలో ఉత్తర హిందూ మహాసముద్రంలో బలమైన వేడి గాలులు ఏర్పడి పర్యావరణ సమతౌల్యాన్ని దెబ్బతీస్తాయి. తూర్పు, మధ్య పసిఫిక్ మహాసముద్ర ఉపరితల ఉష్ణోగ్రతల్లో మార్పుల నేపథ్యంలో ఎల్నినో ప్రారంభమైందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది.

ఈ ఏడాది ఏప్రిల్ వరకు తటస్థ పరిస్థితులు ఉండగా, తాజాగా ఎల్నినోగా మారిందని ప్రకటించింది. వచ్చే ఏడాది జనవరి వరకు ఈ పరిస్థితులు కొనసాగే అవకాశం ఉందని తెలిపింది. బలమైన ఎల్నినో సూపర్ ఎల్నినోగా మారే ప్రమాదం కూడా ఉందని అంతర్జాతీయ వాతావరణ సంస్థలు హెచ్చరిస్తున్నాయి. ఐఎండీ అంచనాల ప్రకారం ఈ ఏడాది వర్షపాతం 92 నుంచి 94 శాతానికి మాత్రమే పరిమితం కావచ్చని పేర్కొంది.