అవకాశాలను ఆయుధాలుగా మలుచుకోవాలి

అవకాశాలను ఆయుధాలుగా మలుచుకోవాలి
ఉన్నత స్థానాలకు ఎదిగి ఎందరికో స్ఫూర్తిగా నిలవాలి
విద్యాశాఖలో అపూర్వ సంస్కరణలు
కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్
ఉమ్మడి గుంటూరు బ్యూరో, ఆంధ్రప్రభ: ప్రభుత్వ పాఠశాలల ‘జయభేరి’ కార్యక్రమం కింద పదో తరగతిలో ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, గురువులకు ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్రప్రసాద్ ఆధ్వర్యంలో సత్కార కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గుంటూరు తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే మహమ్మద్ నసీర్ అహ్మద్‌తో కలిసి గ్రామీణాభివృద్ధి, కమ్యూనికేషన్స్ శాఖ కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ మాట్లాడుతూ.. పదో తరగతి పరీక్షల్లో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులకు ప్రోత్సాహకంగా ఆర్థిక సహాయం అందిస్తున్న ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్రప్రసాద్‌ను అభినందించారు. వేలాది మంది విద్యార్థులు టెన్త్ పరీక్షలు రాస్తున్నప్పటికీ, కొందరికే అద్భుతమైన మార్కులు వస్తాయని, ఇందుకు విద్యార్థుల ప్రతిభతో పాటు తల్లిదండ్రులు, గురువుల కృషి కూడా ప్రధాన కారణమని పేర్కొన్నారు.

“మీకు భగవంతుడు ప్రసాదించిన మేధస్సును సరైన దిశలో వినియోగించుకుని ఉన్నత చదువులు అభ్యసిస్తే, భవిష్యత్తులో మరెందరికో సాయం చేసే స్థాయికి ఎదుగుతారు. ఈరోజు మీరు సాధించిన మార్కులు సమాజంలో మీకు ప్రత్యేక గుర్తింపునిచ్చే ద్వారాలుగా నిలుస్తాయి. ఎంత ఎత్తుకు ఎదిగినా వినయాన్ని కోల్పోకూడదు” అని సూచించారు.

విద్యార్థుల అభివృద్ధి కోసం విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చారని మంత్రి తెలిపారు. మధ్యాహ్న భోజన పథకం అమలు, ప్రతి 20 మంది విద్యార్థులకు ఒక ఉపాధ్యాయుడిని నియమించడం, పేరెంట్-టీచర్ సమావేశాలు నిర్వహించడం వంటి కార్యక్రమాలు విద్యాశాఖలో కొత్త మార్పులకు దారి తీశాయని అన్నారు.
“ఇక్కడ అద్భుతమైన ఫలితాలు సాధించిన విద్యార్థుల్లో చాలామంది పేద కుటుంబాల నుంచి వచ్చి ఉండొచ్చు. మీ వద్ద సౌకర్యాలు తక్కువగా ఉన్నా, ఉన్న అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ ముందుకు సాగాలి. మేము కూడా మీలాగే సాధారణ స్థాయి నుంచి వచ్చిన వారమే. విజయం అనేది ఒక్కసారిగా వచ్చేది కాదు. కష్టం, ప్రతిభ, క్రమశిక్షణ, సరైన విధానాలే మనిషిని ఉన్నత స్థాయికి తీసుకెళ్తాయి. మీరు సాధించే విజయాలు దేశ భవిష్యత్తుకు ఎంతో ఉపయోగపడతాయి” అని డాక్టర్ పెమ్మసాని పేర్కొన్నారు.
ఎమ్మెల్యే నసీర్ అహ్మద్
ప్రభుత్వ పాఠశాలల్లో చదివి ఉన్నత ఫలితాలు సాధించి ఇతర విద్యార్థులకు ఆదర్శంగా నిలిచిన విద్యార్థులను ఎమ్మెల్యే మహమ్మద్ నసీర్ అహ్మద్ అభినందించారు. గతంలో ప్రభుత్వ పాఠశాలలు పేదలకు నాణ్యమైన విద్య అందించే కేంద్రాలుగా ఉండేవని, ఇప్పుడు ప్రైవేట్ పాఠశాలలకు పోటీగా నిలుస్తూ అద్భుత ఫలితాలు సాధిస్తున్నాయని అన్నారు.
ఈ మార్పుకు విద్యా, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ తీసుకొచ్చిన కార్యాచరణ ప్రధాన కారణమని పేర్కొన్నారు. విద్యార్థులు, గురువులు, తల్లిదండ్రులను ఒకే వేదికపైకి తీసుకొచ్చే పేరెంట్-టీచర్ సమావేశాలు వంటి ఎన్నో మంచి నిర్ణయాలు తీసుకున్నారని కొనియాడారు. విద్యాశాఖ అభివృద్ధిపై మంత్రి లోకేష్‌కు స్పష్టమైన ప్రణాళిక ఉందని తెలిపారు.
“ఇంతటి అద్భుత విజయాలు సాధిస్తున్న కూటమి ప్రభుత్వంలో ఎమ్మెల్యేగా పని చేయడం నాకు గర్వకారణం” అని ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ పేర్కొన్నారు.
అనంతరం కార్యక్రమంలో భాగంగా జిల్లా, పాఠశాల స్థాయిలో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులకు ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్రప్రసాద్, ఎమ్మెల్యే నసీర్ అహ్మద్‌తో కలిసి మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ప్రోత్సాహకాలు అందజేశారు.
ఈ కార్యక్రమంలో గుంటూరు జిల్లా టీడీపీ అధ్యక్షుడు పిల్లి మాణిక్యాలరావు, టీడీపీ జిల్లా ఉపాధ్యక్షుడు పోతినేని శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్సీలు అశోక్ బాబు, ఏఎస్ రామకృష్ణ, జిల్లా విద్యాశాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.
