ప్రజల భద్రత కోసమే కమ్యూనిటీ కాంటాక్ట్…!
- అసాంఘిక కార్యకలాపాలపై ఉక్కు పాదం..!
- సిరిచెల్మలో పోలీసుల కార్డెన్ సర్చ్…!
- 156 మోటార్ బైక్ లు.. 8 కార్లు, 200 మద్యం బాటిళ్లు స్వాధీనం..!
ఆంధ్రప్రభ బ్యూరో, ఉమ్మడి ఆదిలాబాద్ : ప్రజల రక్షణ, భద్రత కోసమే గ్రామీణ ప్రాంతాల్లో పోలీస్ కాంటాక్ట్ కమ్యూనిటీ ప్రోగ్రాం నిర్వహిస్తున్నామని ఆదిలాబాద్ జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. ఇచ్చోడ మండలంలోని సిరిచెల్మ గ్రామంలో గురువార 120 మంది పోలీస్ సిబ్బందితో కలిసి కమ్యూనిటీ కాంటాక్ట్ ను నిర్వహించారు. ఈ సందర్భంగా సరైన ధ్రువ పత్రాలు లేనటువంటి 156 ద్విచక్ర వాహనాలు, 2 ఆటో లను, 8 కార్లు, బొలెరో లను స్వాధీనం చేసుకున్నామని ఎస్పీ తెలిపారు. నెంబర్ ప్లేట్ లేని 3 వాహనాలపై చట్ట పరమైన చర్యలు తీసుకోవాలని ఎస్పీ ఆదేశించారు.

అక్రమంగా కల్తీ కల్లు తయారు చేయడానికి ఉపయోగపడే ముడి సరుకు అమ్మోనియం బైకార్బొనేట్ ఒక క్వింటాల్ వరకు స్వాధీనం చేసుకొని నిందితుడు సురేందర్ గౌడ్ పై కేసు నమోదు చేస్తున్నట్లు తెలిపారు. అదేవిధంగా అక్రమ మద్యం అనుమతులు లేకుండా విక్రయిస్తున్న పి. శ్రీనివాస్ గౌడ్ అనే వ్యక్తి వద్ద దాదాపు 200 బాటిల్ల మద్యం లభించినట్లు పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఎస్పీ గ్రామస్తులతో మాట్లాడుతూ అసాంఘిక, చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు దూరంగా ఉండాలని సూచించారు.గంజాయి, మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలని, దొంగతనాలు, దోపిడీలు చేయకుండా, సత్ప్రవర్తనతో మెదలాలనీ తెలిపారు.
గొడవలకు దారి తీసేలా ప్రవర్తించిన వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. వీడిసి అక్రమాలు, బలవంతపు వసూళ్లు, నంబర్ ప్లేట్లు లేకుండా తిరగడం, దొంగ వాహనాలను కొనుగోలు చేయడం లాంటివి చేయవద్దని తెలిపారు. ఇదివరకే కేసులలో నమోదైన వారిపై సస్పెక్ట్ షీట్లు, రౌడీ షీట్స్ ఓపెన్ చేయడం జరిగిందని, మిగిలిన వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిపై 8712659973 నెంబర్ కు వాట్సప్ ద్వారా సమాచారం అందించవచ్చని తెలిపారు. వారి వివరాలు గోప్యంగా ఉంచబడతాయని తెలిపారు.
- పిల్లలను తల్లిదండ్రులు బాగా చదివించాలి..!
విద్యార్థులకు చిన్నప్పటినుండి చదువుపై ఆసక్తి పెంచేలా తల్లిదండ్రులు కృషి చేయాలని, చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని, ఆరోగ్యం పై దృష్టి సారించాలని తెలిపారు. మద్యం సేవించి వాహనాలు నడపకుండా ఉండాలని, ట్రాఫిక్ నియమ నిబంధనలు పాటిస్తూ, రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు సక్రమంగా వాహనాలను నడుపుతూ ఉండాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉట్నూర్ ఏఎస్పి రుత్వీక్ సాయి కొట్టే, స్పెషల్ బ్రాంచ్ డిఎస్పి ఎన్. వెంకట నరసయ్య, ఎ ఆర్ డిఎస్పీ కమతం ఇంద్రవర్ధన్, సిఐ నరేష్, రిజర్వ్ ఇన్స్పెక్టర్ డి వెంకటి, తోట మురళి, ఎస్సైలు, స్పెషల్ పార్టీ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు. - మారుతి గూడా లో పోలీసుల స్పెషల్ డ్రైవ్..!
బేల మండలం మారుతి గూడలో గురువారం ఆదిలాబాద్ డిఎస్పీ జీవన్ రెడ్డి ఆధ్వర్యంలో స్పెషల్ కార్డెన్ సర్చ్ నిర్వహించి గుడుంబా స్థావరాన్ని ధ్వంసం చేశారు. 40 వాహనాలను స్వాధీనపరుచుకున్నారు. శాంతిభద్రతల పరిరక్షణకు ప్రజలతో సత్సంబంధాలు ఏర్పరచుకునేందుకే కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం నిర్వహిస్తున్నట్టు డిఎస్పీ తెలిపారు. గ్రామాల్లో సిసిటివి కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జైనథ్ సీఐ శ్రవణ్, ఎస్సై మధు కృష్ణ, గౌతమ్, పీర్ సింగ్ నాయక్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
